వన్యప్రాణుల పాలిట శాపంగా గ్రావిటీ కెనాల్

78

దిశ, కాటారం: కెనాల్‌లో గలగల పారుతున్న నీటిని చూసిన వన్యప్రాణులు చెంగున దూకాయి. నీటిని తాగి.. కాసేపు సేద తీరుదాముకున్నాయి.. కానీ నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండడంతో ఆందోళనకు గురై అరిచాయి. వన్య ప్రాణులను కాపాడేందుకు అక్కడున్న వారికి సాహసించాలని ఉన్నా ప్రవాహంలో దూకితే తమ ప్రాణాలకూ గ్యారెంటీ లేదని భయంతో వెనకడుగు వేశారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగానే రెస్క్యూ టీం రంగంలోకి దిగి కొన్ని అడవి జంతువులను కాపాడారు. ఈ ఘటనకు ముందే చాలా వరకు వన్య ప్రాణులు మృత్యు ఒడిలోకి చేరాయి. వేసవి కాలంలో అయితే ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది.

జాగ్రత్తలు పాటించక..

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి అన్నారం బ్యారేజీ వరకు నీటిని సరఫరా చేసేందుకు సుమారు 12.5 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ నిర్మించారు ఇరిగేషన్ అధికారులు. కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచినీటిని గ్రావిటీ కెనాల్ లో ఎత్తిపోయిస్తుంటారు. నిత్యం ఈ కెనాల్ నిండుకుండను మరిపించే విధంగా ఉంటుంది. అయితే ఈ కెనాల్ అటవీ మార్గం మీదుగా ఉండడంతో వనాల మధ్య తిరిగే ప్రాణులు నీటికోసం అందులోకి దూకుతున్నాయి. దాహార్తిని తీర్చుకునేందుకు నీటిని చూడగానే కెనాల్‌లో దూకిన అడవి జంతువులు ప్రవాహంలో కొట్టుకపోయో.. లేక నీట మునిగో చనిపోతున్నాయి. గత సంవత్సరం ఈ కెనాల్ పరిసర ప్రాంతాల నుండి ఫోన్ వస్తే చాలు ఫారెస్ట్ అధికారులు ఉలిక్కిపడేవారు. దీంతో రెస్క్యూ టీంను అందుబాటులో ఉంచాల్సిన పరిస్థితి తయారైంది.

కెనాల్‌కు ఇరువైపులా ఫెన్సింగ్

వన్య ప్రాణులను కాపాడలంటే కెనాల్ కు ఇరువైపులా ఫిన్సింగ్ వేయాలని స్థానికులు ఇరిగేషన్ అధికారులను కోరుతున్నారు. అటవీ అధికారులు ఈ ప్రతిపాదన చేసి ఏడాది గడిచినా ఆచరణలోకి మాత్రం రావడం లేదు. దీంతో ఈ వేసవిలో కూడా గత అనుభవాలను ఎదుర్కోక తప్పదని స్థానికులు వాపోతున్నారు. సాధారణంగా ఫిబ్రవరి నెల నుంచే అడవుల్లో సమృద్ధిగా నీరు లభ్యం కాదు. దీంతో దప్పిక తీర్చుకునేందుకు జంతువులు వేట మొదలుపెడతాయి. ఈ క్రమంలో ఈ సారి కూడా మూగ జీవాలు శాశ్వతంగా మూగబోయే ప్రమాదం ఉంది. అటవీ సరిహద్దుల్లో కందకాలు తవ్వించినప్పటికీ గంతులేస్తూ పరిగెత్తే ప్రాణులు బాహ్య ప్రపంంచంలోకి వస్తాయి. కాబట్టి ఇరిగేషన్, ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా వన్యప్రాణులను కాపాడేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

వాటర్ ఫెసిలిటీ మస్ట్..

అటవీ అధికారులు కూడా మూగజీవాల కోసం ప్రత్యేకంగా వాటర్ స్టోరేజీ పాయింట్లను ఏర్పాటు చేయాలని జంతు ప్రేమికులు చెప్తున్నారు. చిన్నచిన్న జంతువులకు అందుబాటులో ఉండే విధంగా వీటిని సిద్దం చేయాలని పేర్కొంటున్నారు. దప్పిక తీర్చుకునేందుకు అడవుల నుంచి బయటకు వచ్చే ప్రాణులను వేటగాళ్లు అంతమొందించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.