అంగ్రేజీ మీడియం సినిమా రివ్యూ

by  |
అంగ్రేజీ మీడియం సినిమా రివ్యూ
X

బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరొందిన ఇర్ఫాన్ ఖాన్ కథాబలమున్న చిత్రాల్లో నటిస్తూ తన నటనకు సార్ధకత చేకూరుస్తున్నాడు. ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో 2017లో ‘హిందీ మీడియం’ సినిమా వచ్చి మంచి విజయాన్నందించింది, దానికి కొనసాగింపుగా మడ్డోక్ ఫిల్మ్స్, లండన్ కాలింగ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘అంగ్రేజీ మీడియం’ సినిమాకు హోమీ అద్జానియా దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేడు ధియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులు తిరగరాసేలా కనిపిస్తోంది. క్యాన్సర్‌‌తో పోరాడుతూ కూడా ఇర్ఫాన్ ఖాన్ పాత్రలో ఒదిగిపోయిన తీరు అభిమానులను అలరిస్తోంది.

ఇక చిత్ర కథలోకి వెళ్తే.. ఉదయ్‌పూర్‌లోని చంపక్ బన్సాల్ (ఇర్ఫాన్ ఖాన్) స్వీట్ షాప్ ఓనర్. అతని కుమార్తె తారికా బన్సాల్ (రాధికా మదన్) స్కూలు విద్య పూర్తి చేసుకుని, ఉన్నత విద్యనభ్యసించేందుకు లండన్ వెళ్లాలని అనుకుంటుంది. టాలెంట్‌తో అక్కడ చదివేందుకు స్కాలర్‌షిప్ కూడా సంపాదించుకుంటుంది. అయితే అది పోవడానికి తండ్రే కారణమవుతాడు. చేసిన తప్పు సరిదిద్దుకునేందుకు కుమార్తెను ఉన్నత విద్యకు లండన్ పంపించిన చంపక్ బన్సాల్, పోటీ వ్యాపారంలో దెబ్బతింటాడు. దీంతో కుమార్తె ఫీజు కోటి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో దుబాయ్‌లోని క్రికెట్ ఫిక్సర్ సాయంతో తమ్ముడి కారణంగా లండన్ చేరుకుంటాడు. అక్కడ ఒక నేరంలో ఇరుక్కుని కోపిష్ఠి పోలీసు అధికారి నైనా కోహ్లీ (కరీనా కపూర్) కి పట్టుబడతాడు. ఆ నేరం నుంచి బయటపడ్డాడా? చివరికి కుమార్తె విద్య పూర్తి చేసేందుకు చంపక్ బన్సాల్ సహాయపడ్డాడా? తారికా బన్సాల్ పట్టభద్రురాలైందా? ఈ క్రమంలో అతని ఇబ్బందులేంటి? అన్నదే సినిమా కథ.

విద్యావ్యవస్థ వ్యాపారమయంగా మారిన దుస్తితిని దర్శకుడు కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. భావోద్వేగాలకు పెద్దపీట వేయాల్సిన సినిమాను ఆహ్లాదకరంగా మార్చే క్రమంలో తడబడ్డాడు. చదువులో పెద్దగా ప్రతిభ కనబర్చని తారిక లండన్ వెళ్లాలనుకోవడం, అక్కడి యూనివర్సిటీలో సీటు, స్కాలర్‌షిప్ కొట్టడం లాజిక్‌కు అందవు. కథను అద్జానియాతో పాటు భవీశ్ మందాలియా, గౌరవ్ శుక్లా, వినయ్ చావల్, సారా బొందినార్ కలిసి కథ రాయడంతో ఈ గందరగోళం ఏర్పడి ఉంటుంది. కెమెరా పనితనం అద్భుతంగా ఉంది.

సినిమాలోని ప్రధాన తారాగణం ఇర్ఫాన్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, రాధికా మదన్, దీపక్ దొబ్రియాల్, రణ్‌వీర్ షోరే, పంకజ్ త్రిపాఠీ, డింపుల్ కపాడియా తదితరుల సందర్భోచిత అద్భుత నటనతో పాటు ‘కుడిను నచ్‌నే దే’ పాటలో అనుష్క శర్మ, కత్రినా కైఫ్, అలియా భట్, జాన్వీ కపూర్, అనన్య పాండే, కృతిసనోన్, కియారా అడ్వానీ తదితరులు కనువిందు చేసి సినిమాను మరింత అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అక్కడక్కడ స్లో నెరేషన్‌తో ఇబ్బంది పెట్టినా పాత్రధారుల నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. ఈ రివ్యూ వీక్షకుడి దృష్టి కోణం నుంచి ఇచ్చిన వ్యక్తిగత అభిప్రాయం.

tags : hindi medium, angreji medium, irfan khan, kareena kapoor khan, radhika madan, deepak dobriyal, ranveer shorey, dimple kapadia


Next Story

Most Viewed