మనీ లేక మినీ ట్యాంక్‌బండ్‌ ఆగిపోయింది

by  |
మనీ లేక మినీ ట్యాంక్‌బండ్‌ ఆగిపోయింది
X

దిశ, అందోల్ : అందోల్ పెద్దచెరువు ఆహ్లాదంగా మార్చేందుకు చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. క‌ట్ట‌పై మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు, రంగు రంగుల పూల‌మొక్కలు, బోటింగ్ స‌దుపాయం వంటి ఆధునిక హంగుల‌తో మినీ ట్యాంక్‌బండ్‌గా మారాల్సిన చెరువు.. నిధుల లేమి కారణంగా కళావిహీనంగా తయారైంది. పనులు అసంపూర్తిగా చేపట్టి వదిలేయడంతో ఆ ప్రాంతాన్ని మందుబాబులకు అడ్డాగా మార్చుకుంటున్నారు. ఈ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు 2016లో నాటి ఎమ్మెల్యే బాబు‌మోహన్ హయాంలో రూ.4.90 కోట్ల నిధులతో పనులు ప్రారంభించారు. ప్రస్తుతం కట్టపై ఎలాంటి పనులు జరగకపోవడంతో ముండ్ల పొదలు పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగాయి. పనులు పూర్తికాకపోవడం వల్ల ఇక్కడికి వచ్చేందుకు సైతం ప్రజలు ఆసక్తి చూపడం లేదు.

కొత్తగా ప్రతిపాదనలు..

10 మీటర్ల మేర కట్ట వెడల్పు, అందోల్ వద్ద బతుకమ్మ ప్లాట్ ఫామ్, తూము, అలుగు మరమ్మతులు, 450 మీటర్ల పొడవునా 6 నుంచి 8 మీటర్ల ఎత్తులో కట్టకు సైడ్‌ వాల్‌ నిర్మించారు. 450 మీటర్ల వరకు వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ఇలా సుమారు రూ.3 కోట్ల వరకు పనులు చేపట్టగా, రూ.కోటి మాత్రమే కాంట్రాక్టర్‌కు చెల్లించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా మరో రూ.6 కోట్ల పనులకు సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ నిధులతో టీడీపీ ఆఫీస్ నుంచి గెస్ట్ హౌస్ వరకు 1.2 కిలో మీటర్ల మేరకు సీసీ రోడ్డు, వాకింగ్ ట్రాక్, ఎలక్ట్రానిక్, చిల్డ్రన్ పార్క్, స్టాల్స్, బోటింగ్ ఫుట్‌పాత్, వంటివి ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. చెరువు కట్ట సైడ్‌వాల్‌కు సంబంధించిన బిల్లును పాత నిధుల్లో‌కి డైవట్ చేశారు. గతంలో చేపట్టిన పనులకు బిల్లుల చెల్లింపులు కాకుండానే, కొత్త వాటి కోసం ప్రతిపాదనలు పంపించడం విడ్డూరంగా ఉందని పలువురు ఆశ్చర్యపోతున్నారు.

కట్ట చుట్టూ పిచ్చిమొక్కలే..

చెరువు కట్ట చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి. ఒక దశలో ఈ మొక్కలతో కట్ట సైతం కనిపించకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో అయ్యప్ప దేవాలయం వెనక భాగంలో నిర్మించిన ప్లాట్‌ఫాం ప్రస్తుతం మందుబాబులకు అడ్డాగా మారింది. అక్కడే ఏర్పాటు చేసిన ఐమాస్ట్ లైటు చాలా నెలలుగా వెలగడంలేదు. దీనిని ఎవరూ పట్టించుకోకపోవడంతో మరమ్మతుకు నోచుకోలేదు. అందోలు చెరువు పనులను ఇరిగేషన్‌శాఖ చీఫ్ ఇంజనీరింగ్‌ స్థాయి అధికారులు సైతం పరిశీలించినా.. ముందడుగు పడటం లేదు.


Next Story

Most Viewed