YSRCP: వైసీపీ సింహం..ఇక సింగిలేనా..!

by Ramesh Goud |

సింగిల్ సింహం జ‌గ‌న‌న్న .. సింహం సింగిల్ గానే వ‌స్తుందంటూ భారీ డైలాగ్స్ చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల‌కు ఇప్పుడు అస‌లు సినిమా క‌నిపిస్తోంది.

YSRCP: వైసీపీ సింహం..ఇక సింగిలేనా..!
X

దిశ‌, ఏపీబ్యూరో: సింగిల్ సింహం జ‌గ‌న‌న్న .. సింహం సింగిల్ గానే వ‌స్తుందంటూ భారీ డైలాగ్స్ చెప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల‌కు ఇప్పుడు అస‌లు సినిమా క‌నిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సింగిల్ గా పోటీ చేసిన వైసీపీ 151 స్థానాల నుండి 11 స్థానాల‌కు ప‌డిపోవ‌డం పార్టీ అధినేత‌కు, పార్టీ శ్రేణుల‌కు బిగ్ షాక్ అయితే, ఆ త‌ర్వాత వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాలు పార్టీశ్రేణుల‌కు షాకుల పైన షాక్ లిస్తున్నాయి. జ‌గ‌న్ పార్టీ మ‌రింత దిగ‌జార‌బోతోందా అన్న సందేహాలు పార్టీ కేడర్‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నాయి.

రాజీనామాల పరంపర..

ఇప్ప‌టికే పార్టీకి ప‌లువురు మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఆ త‌ర్వాత ఎమ్మెల్సీలు వారి ప‌ద‌వుల‌కు, పార్టీకి రాజీనామా చేశారు. న‌లుగురు రాజ్య‌స‌భ ఎంపీలు రాజీనామా చేశారు. సోమ‌వారం రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌రిగిన ప‌లు మున్సిపాల్టీల చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక‌ల్లో పెద్ద సంఖ్య‌లో వైసీపీ కార్పొరేట‌ర్లు ఎన్డీఏ కూట‌మికి ఓట్లేసి ఫ్యాన్ పార్టీని దెబ్బ కొట్టారు. కాగా, నెక్ట్స్ వైఎస్సార్ కాంగ్రెస్ నుండి జార‌బోయేది ఎమ్మెల్యేల‌ని పార్టీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీలోని 11 స్థానాల‌కు ఎమ్మెల్యేల్లో ప‌లువురు ప‌క్క పార్టీల వైపు చూస్తున్నార‌ని, త్వ‌ర‌లో ముగ్గురు ఎమ్మెల్యేలు జ‌న‌సేన‌లో చేరే ఛాన్స్ ఉందంటూ పార్టీ నేత‌లు చెవులు కొరుక్కుంటున్నారు. దీంతో, పార్టీ మార‌బోయే ఎమ్మెల్యేలు ఎవ‌ర‌న్న ఆస‌క్తితో పాటు, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌గ‌న‌న్న సింగిల్ గా మిగిలిపోతారా? అన్న ఆందోళ‌న పార్టీ శ్రేణుల్లో క‌నిపిస్తోంది.

అన్ లిమిటెడ్ ప‌వ‌ర్ టూ రాజ‌కీయ స‌న్యాసం

జగన్ - విజ‌య‌సాయిరెడ్డి.. ఈ బంధం ఫెవికాల్ కంటే దృఢ‌మైంది. నాలుగు త‌రాలుగా వైఎస్ కుటుంబానికి త‌ల‌లో నాలుక‌గా, వారి వ్యాపార సామ్రాజ్యానికి ఆడిట‌రుగా ఉన్న వ్య‌క్తి, సాయిరెడ్డి. అంతేకాదు జ‌గ‌న్ కు సంబంధించిన ప్ర‌తి వ్యాపారం, రాజ‌కీయ అడుగుల వెనుక కీల‌క సూత్ర‌ధారి ఆయనే. అక్ర‌మాస్తుల కేసుల్లో జ‌గ‌న్ ఏ1 అయితే, విజ‌య‌సాయి ఏ 2, వైఎస్సార్ కాంగ్రెస్ లో జ‌గ‌న్ నెంబ‌ర్ 1 కాగా, పార్టీ నెంబ‌ర్ టూ ఆయ‌నే. ఐదేళ్ల వైసీపీ ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ టూగా అపరిమిత అధికారాన్ని అనుభ‌వించిన విజ‌య‌సాయిరెడ్డి లాంటి వ్య‌క్తి సీఎం సీటు నుండి జ‌గ‌న్ దిగిపోయి ఏడు నెల‌లు తిర‌క్కుండానే రాజ‌కీయ స‌న్యాసం తీసుకోవ‌డం వైసీపీ కేడ‌ర్‌ను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

జ‌గ‌న్‌ను అథఃపాతాళానికి తొక్కేస్తాన‌న్న వ్య‌క్తి నీడ‌కు బాలినేని..

విజ‌య‌సాయి కంటే ముందే జ‌గ‌న్ కుటుంబ‌ బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. బాలినేనికి ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా అవ‌కాశం క‌ల్పించిన వైఎస్ కుటుంబానికి రాజ‌కీయంగా టాటా చెప్పారు. వైఎస్సార్ ను పంచెలూడ‌గొడ‌తానన్న వ్య‌క్తి, జ‌గ‌న్‌ను అథఃపాతాళానికి తొక్కేస్తాన‌ని శ‌ప‌థం చేసిన వ్య‌క్తి, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో చేతులు క‌లిపి ఆయ‌న పార్టీలో చేరిపోయారు. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడుగా ముద్రపడిన మ‌రో నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంక‌ట‌రమ‌ణ‌. జ‌గ‌న్ కేబినెట్‌లో ఆయ‌న‌కు అత్యంత‌ ఇష్టుడైన నానీగా పేరున్న మాజీ మంత్రి ఆళ్ల నాని, మ‌రో మాజీమంత్రి అవంతీ శ్రీనివాస్‌తో స‌హా 2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఘ‌న విజ‌యం సాధించిన గ్రంధి శ్రీ‌నివాస్ వంటి ప‌లువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జ‌గ‌న్ పార్టీకి రాజీనామా చేసి, జ‌న‌సేన‌, తెలుగుదేశం పార్టీల్లో చేరారు.

ఆ న‌లుగురి రాజీనామాతో డీలా..

మ‌రీ ముఖ్యంగా న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు.. మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద మ‌స్తాన్‌రావు, ఆర్.కృష్ణ‌య్య‌, విజ‌య‌సాయిరెడ్డిలు వారి ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌రీ పార్టీ నుండి బైట‌కు వెళ్లారు. అంటే, ఘోర‌మైన ఓట‌మి క‌ష్టాల్లో ఉన్న జ‌గ‌న్‌ను మ‌రింత క‌ష్టాల్లోకి నెడుతూ, ఆ నలుగురూ రాజీనామాలు చేయ‌డం పార్టీని డీలా ప‌డేసింది. లోక్ స‌భ‌లో బ‌లం లేక పోయినా, రాజ్య‌స‌భ‌లో ఉన్న బ‌లంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు కొర‌క‌రాని కొయ్య‌లా మార‌దామ‌ని భావించిన జ‌గ‌న్ కు వీరి రాజీనామాలు షాక్ క‌లిగించాయ‌ని పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఫ్యాన్‌కు క‌రెంట్‌ షాక్..

సోమ‌వారం రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌రిగిన ప‌ది కార్పొరేష‌న్‌, మున్సిపాలిటీల‌కు జ‌రిగిన చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక‌ల్లో ఫ్యాన్ పార్టీకి క‌రెంట్ షాక్ త‌గిలింది. వైసీపీకి పూర్తిస్థాయి బ‌లం ఉన్న స్థానాల్లో కూడా కార్పొరేట‌ర్లు పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డ‌టంతో ప‌ద‌వులు ఎన్డీఏ కూట‌మి ద‌క్కించుకుంది. దీంతో వైసీపీ కార్య‌క‌ర్త‌లు కంగుతిన్నారు.

ఎమ్మెల్యేల ప‌క్కచూపులు?

ప్ర‌స్తుతం వైసీపీకి మాజీ సీఎం జ‌గ‌న్ తో స‌హా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, వైసీపీ ఎమ్మెల్యేల్లో కొంత‌మంది ప‌క్క పార్టీల వైపు చూస్తున్నార‌ని టాక్‌. అధికార కూట‌మిలోని జ‌న‌సేన‌, బీజేపీల్లో చేర‌డానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఆస‌క్తి చూపుతున్నార‌ని స‌మాచారం. వైసీపీ ఎమ్మెల్యేల‌కు టీడీపీ త‌లుపులు తెర‌వ‌డం లేద‌ని, సోష‌ల్ మీడియా ట్రోలింగ్‌, కార్య‌క‌ర్త‌ల ఒత్తిడి కార‌ణంగా వైసీపీ ఎమ్మెల్యేల‌కు గేట్లు మూసేశార‌ని అంటున్నారు. జ‌న‌సేన‌, బీజేపీ మాత్రం ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేల కోసం త‌లుపులు తెరిచే ఉంచిన‌ట్లు స‌మాచారం.

Next Story