బోరుగడ్డ అనిల్‌తో వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు: నాగరాజు యాదవ్

by Malleboina Mahesh |

గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్‌తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) స్పష్టం చేసింది.

బోరుగడ్డ అనిల్‌తో వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు: నాగరాజు యాదవ్
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్‌ (Borugadda Anil Kumar) తో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో బోరుగడ్డ అనిల్ పలు మీడియా ఇంటర్వ్యూలలో, సోషల్ మీడియా వేదికలలో తాను వైసీపీకి చెందిన వ్యక్తిగా ప్రస్తావించు కుంటూ వచ్చాడు. దీనిపై పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అతను వైసీపీ పేరు చెప్పుకుని తిరుగుతున్నప్పటికీ, అతనికి పార్టీతో ఎలాంటి అనుబంధం గానీ, ప్రాతినిధ్యం గానీ లేదని ఆ ప్రకటనలో తేల్చిచెప్పారు. బోరుగడ్డ అనిల్‌పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్న నేపథ్యంలో, అతని వ్యవహారాలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఈ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అతని వ్యక్తిగత కార్యకలాపాలు, వ్యాఖ్యలు పూర్తిగా అతని సొంతమని, పార్టీ వైఖరితో వాటిని ముడిపెట్టకూడదని వైసీపీ అధిష్టానం (YCP leadership) ఈ ప్రకటన ద్వారా ప్రజలకు, మీడియాకు తెలియజేసింది.

ఇదిలా ఉంటే రౌడీ షీటర్ అయిన బోరుగడ్డ అనిల్ వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, వారి కుటుంబాలకు బహిరంగంగా బెదిరింపులకు పాల్పడ్డారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ లపై పరుష పదజాలంతో తీవ్ర స్థాయిలో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతనిపై వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే తనతో వైసీపీ పార్టీ నేతలే చంద్రబాబు కుటుంబాన్ని తిట్టించారని, వాళ్లు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే తాను ఫాలో అయ్యానని పోలీసుల విచారణలో తెలిపారు. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తితో తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించడం ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Next Story