కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల విమర్శలు

by Thanuru Gopichand |

YCP vs TDP ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం.

కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై వైసీపీ (YCP) కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విభజన తర్వాత పదేళ్లపాటు హైదరాబాద్‌లో ఉండే అవకాశం ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు కేవలం 'ఓటుకు నోటు' కేసులో దొరికిపోయి భయంతోనే ఏపీకి పారిపోయి వచ్చారని ఆరోపించారు. ఒకవేళ హైదరాబాద్‌లోనే ఉండి ఉంటే రాష్ట్రం సహజంగా అభివృద్ధి చెందేదని, ఇప్పుడు అమరావతి పేరుతో వేల కోట్ల ప్రజాధనం వృథా అయ్యే పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిని ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. కేవలం ప్రజాధనం వృథా కావొద్దనే ఉద్దేశంతోనే పాలనా వికేంద్రీకరణను ప్రతిపాదించారని స్పష్టం చేశారు. జగన్ తన నివాసం, వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూడా అమరావతి ప్రాంతంలోనే నిర్మించుకున్నారని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఇప్పటికీ అక్రమ నివాసంలోనే ఉంటున్నారని ఎద్దేవా చేశారు.

​అమరావతిని వైసీపీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తోందని ప్రకటించారు. అయితే కూటమి ప్రభుత్వం చెబుతున్న అమరావతి ప్రాజెక్టు "మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్" అని సజ్జల విమర్శించారు. పెద్ద ప్రాజెక్టుల పేరుతో బడ్జెట్‌ను ఇష్టానుసారంగా పెంచుతున్నారని ఆరోపించారు. అంత డబ్బు ఖర్చు చేయడం అవసరమా అని జగన్ ప్రశ్నిస్తే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందన్నారు. కూటమి నేతలు జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు. జగన్ గతంలో విశాఖపై ఫోకస్ పెట్టినట్లుగానే, ఇప్పుడు చంద్రబాబు కూడా అదే బాటలో నడుస్తున్నారని గుర్తుచేశారు. 50 లక్షల చదరపు అడుగుల్లో సెక్రటేరియట్ నిర్మించి ఏం చేస్తారో అర్థం కావడం లేదని, రైతులకు చేయాల్సిన పనులు చేయడం లేదని ఎద్దేవా చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్టుల గురించి ప్రభుత్వం నోరు మెదపడం లేదని, అమరావతి పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు.

Next Story