మంత్రి లోకేశ్‌కు వైసీపీ నేత విడదల రజిని కౌంటర్.. మెడికల్ కాలేజీల అంశంపై కీలక ప్రశ్నలు

by Ramesh Naini |

మంత్రి నారా లోకేశ్ గ్రాఫిక్స్‌, ఏఐ సాయంతో వీడియోలు రూపొందించడంలో సిద్ధహస్తులని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వైసీపీ నేత, మాజీ మంత్రి విడుదల రజిని అన్నారు.

మంత్రి లోకేశ్‌కు వైసీపీ నేత విడదల రజిని కౌంటర్.. మెడికల్ కాలేజీల అంశంపై కీలక ప్రశ్నలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి నారా లోకేశ్ గ్రాఫిక్స్‌, ఏఐ సాయంతో వీడియోలు రూపొందించడంలో సిద్ధహస్తులని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. మంత్రి లోకేశ్ ఇటీవల ట్వీట్ చేసిన వీడియోపై స్పందించిన ఆమె పలు కీలక ప్రశ్నలు వేశారు. అన్ని అనుమతులు ఉన్న మెడికల్ కాలేజీలు నిర్మించడానికి 25 ఏళ్లు పడుతాయని మంత్రి లోకేశ్ అంటున్నారని పేర్కొన్న రజిని, అంత కాలం ఎందుకు పడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా కారణంగా నష్టపోయినా, మిగిలిన మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలకు భూమి సేకరణ చేసి, అనుమతులు పొంది ఐదు కాలేజీల నిర్మాణాన్ని పూర్తిచేసిందని గుర్తుచేశారు. అప్పటికే మరో రెండు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, మరి మిగిలిన 10 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి 25 ఏళ్లు ఎందుకు పడుతాయని ప్రశ్నించారు.

పీపీపీ విధానంలో రెండు, మూడు ఏళ్లలోనే మెడికల్ కాలేజీలు పూర్తిచేయవచ్చని మీరు చెబుతున్నారని, అయితే 14 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న మీ తండ్రి చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఎందుకు తీసుకురాలేకపోయారని రజిని నిలదీశారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించారు. ఇక 10 మెడికల్ కాలేజీలు కట్టడానికి 25 ఏళ్లు పడుతుంటే, హైదరాబాద్‌, హైటెక్ సిటీని తామే నిర్మించామని ఎలా చెబుతారని ఆమె విమర్శించారు. చివరిగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి మందికి పైగా సంతకాలు చేసి ప్రజలు తమ వ్యతిరేకతను స్పష్టం చేసినప్పటికీ, మంత్రి లోకేశ్ ఎందుకు పీపీపీ విధానానికే మొగ్గు చూపుతున్నారని విడదల రజిని ప్రశ్నించారు.

Next Story