ఈ నెల 11న కడప మేయర్ ఎన్నిక.. వేడెక్కిన వాతావరణం!!

by Thanuru Gopichand |

కడప మేయర్ (Kadapa Mayor) ఉప ఎన్నిక రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. వైసీపీ నుంచి ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఈ నెల 11న కడప మేయర్ ఎన్నిక.. వేడెక్కిన వాతావరణం!!
X

దిశ, వెబ్ డెస్క్ : కడప మేయర్ (Kadapa Mayor) ఉప ఎన్నిక రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. వైసీపీ నుంచి ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మాజీ మేయర్ ను అవినీతి ఆరోపణలపై కూటమి ప్రభుత్వం పదవీ బాధ్యతలను తొలగించడంతో కడప మేయర్ స్థానానికి ఖాళీ ఏర్పడింది. దీంతో స్థానాన్ని కైవసం చేసుకోవడానికి వైసీపీ నేతలే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఒకరిపై మరొకరు పై చెయ్యి సాధించడానికి పావులను కదుపుతున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలను అమలు చేస్తూ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కడప మేయర్ ఉప ఎన్నిక రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది. కడప మున్సిపల్ కార్పొరేషన్ లో వాతావరణాన్ని వేడెక్కిస్తోంది.

పోటీ నుంచి దూరంగా ఉండనున్న టీడీపీ!

అయితే కడప మేయర్ ఎన్నికకు టీడీపీ పార్టీ దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తటస్థ వైఖరిని అవలంబిస్తూ అవసరాన్ని బట్టి వ్యవహరించాలనే వ్యూహాన్ని అనుసరించాలని కనిపిస్తోంది. అయితే వైసీపీలో కూడా తమకు అనుకూలమైన అభ్యర్థి పోటీలో ఉంటే గెలిపించేందుకు పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

హైకోర్టులో లంచ్ మోషన్

ఒకవైపు మాజీ మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం వేసిన అనర్హతపై చర్చ కొనసాగుతోంది. మరోవైపు ఆయన హైకోర్టులో న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా సురేశ్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ నేడు చేపట్టనుంది. సురేశ్ బాబు తొలగింపుతో డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగం తాత్కాలిక మేయర్‌గా వ్యవహరిస్తున్నారు.

డిసెంబర్ 11న ప్రత్యేక సమావేశం

ఈ నెల 11న ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు జాయింట్ ఇప్పటికే ఆహ్వానాన్ని పంపించారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరగనునన్ సమావేశానికి ప్రతి కార్పొరేటర్ రావాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో 11 తేదీ ఉదయం 11 గంటలకు కొత్త మేయర్ ఎన్నిక జరగనున్నట్లు తెలియవస్తోంది. జాయింట్ కలెక్టర్ లేఖతో కడప రాజకీయాల్లో ఉత్కంఠకు తెరలేచింది.

ఎవరి బలం ఎంతంటే!

jకడప మున్సిపల్ కార్పొరేషన్ లో 50 స్థానాలు ఉండగా.. అందులో ఒకటి టీడీపీ, మరొకటి ఇండిపెండెంట్ కార్పొరేటర్లు ఉన్నారు. మిగిలిన 48 స్థానాల్లోనూ వైసీపీ కార్పొరేటర్లు ఉననారు. వారిలో ఇద్దరు కార్పొరేటర్లు మరణించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడుగురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. దీంతో కడప మున్సిపల్ కార్పొరేషనులో వైసీపీ బలం 40కి చేరింది.

వైసీపీలో పెరిగిన ఆశావహులు

మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం వచ్చే మార్చి 18 నాటికి ముగియనుంది. టీడీపీ ఎలాగూ పోటీలో లేని నేపథ్యంలో వైసీపీలో మేయర్ పీఠం కోసం అంతర్గత పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఆశావహులు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తూ పీఠాన్ని కైవసం చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఎలా ఉన్నా కోర్టు తీర్పు ఎలా ఉంటుందోననే దానిపైనే మేయర్ పీఠం ఎక్కెది ఎవరని నిర్ణయం కానుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story