- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో షర్మిల ఫెయిల్? వైఎస్సార్ వారసత్వంపై అసంతృప్తి
ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో వైఎస్సార్ వారసురాలిగా షర్మిల పనిచేయడం లేదన్న విమర్శలు రోజరోజుకూ పెరుగుతున్నాయి. సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తూ..

దిశ, ఏపీ బ్యూరో: కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పదేళ్లపాటు అధికారానికి దూరమై విలవిలలాడుతున్న కాంగ్రెస్ పార్టీని 2004లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయక మండుటెండల్లో పాదయాత్ర చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, కేంద్రంలోనూ రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా, గాంధీ కుటుంబం అండదండలతో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె పనితీరు అటు హై కమాండ్‌ను, ఇటు పార్టీ శ్రేణులను మెప్పించే విధంగా లేదని పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ షర్మిల పార్టీ ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం ప్రతిపక్ష పార్టీల మీద దుమ్మెత్తి పోయడానికి పెట్టే ప్రెస్ మీట్‌ల కోసం తప్ప కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమె రాష్ట్రానికి రావటం లేదని, తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగానే ఆమె ఇంకా పని చేస్తున్నారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఏపీలో మహిళల సమస్యలు అంటే ఆమెకు గుర్తుకొచ్చేది వైఎస్ సునీతారెడ్డి తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసు, స్వయానా సొంత సోదరుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నుంచి తన తల్లికి, తనకు, తన కుమార్తెకు, కుమారుడికి రావలసిన ఆస్తి పంపకాల సమస్యలు మాత్రమే గుర్తుకొస్తాయని కాంగ్రెస్ పార్టీలోనే విమర్శలు ఎదురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దారుణాల గురించి ఆమె గొంతు ఎత్తడం లేదని, మహిళా సమస్యలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పార్టీ బలోపేతానికి చర్యలు శూన్యం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తుడిచి పెట్టుకు పోయిన కాంగ్రెస్ పార్టీకి తండ్రి వైఎస్ఆర్ చరిష్మాతో షర్మిల తిరిగి జీవం పోస్తారని, కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తారని పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గేతో సహా రాష్ట్రంలోని కాంగ్రెస్ వాదులంతా భావించారు. అయితే షర్మిలలో వైఎస్ఆర్ కున్న పోరాట పటిమ, పట్టుదల, పార్టీ పట్ల అంకిత భావం కనిపించడం లేదని వారు వాపోతున్నారు.
జగన్‌పై విమర్శలకే పరిమితం
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే అని షర్మిల భావిస్తున్నారని, రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న పరిణామాలన్నింటికీ మాజీ సీఎం జగన్ మాత్రమే బాధ్యులనే విధంగా మాట్లాడుతున్నారని సొంత పార్టీలోనే ఆమెపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. సమస్యలున్న చోటికి నాయకులు వెళ్లడం అందులోనూ ప్రతిపక్షంలో ఉన్న నేతలు వెళ్లడం బాధితులను పరామర్శించడం పరిపాటి అని అయితే షర్మిల ఆ విషయాన్ని విస్మరిస్తున్నారని పార్టీ వర్గాలు ఆమెకు గుర్తు చేస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల వల్ల నష్టపోయిన ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారని ఆమెకు పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంపైన ఆ తర్వాత జగన్ ప్రభుత్వం పైన నిరంతరం పోరాడిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను షర్మిల ఇప్పటికైనా గుర్తించి వారికి భరోసాగా నిలబడాలని సూచిస్తున్నారు.
సెలెక్టెడ్ అంశాలపైనే షర్మిల ఫోకస్
రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని సమస్యలు ఉన్నా వైయస్ షర్మిల మాత్రం సెలెక్టెడ్ అంశాలపై మాత్రమే ఫోకస్ పెడతారని ప్రచారంలో ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హత్యాచారానికి గురైన బాలికలు ఉన్నారు. అత్యాచారానికి గురై కనీసం మృతదేహాలు కూడా, లభించని సంఘటనలు ఉన్నాయి. కానీ షర్మిలకు మాత్రం ఆ ఘటనలు కనిపించవు.. ఆ బాధితుల ఆర్తనాదాలు వినపడవని పార్టీ వర్గాల్లో జోరుగా విమర్శలు వినిపిస్తున్నాయి.
సుగాలి ప్రీతి కేసులో స్పందన ఏదీ?
హత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక సుగాలి ప్రీతి కేసు విషయంలో షర్మిల ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు. తమ బిడ్డను చంపిన హంతకులను శిక్షించాలన్న ఆ బాలిక తల్లి ఆందోళనను రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా ఆమె కనీసం గుర్తించలేదు. వివేకానంద రెడ్డి హత్య కేసులో రెండోసారి సిబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్న షర్మిల సుగాలి ప్రీతి హత్య విషయంలో ఆమె తల్లిదండ్రులు చేస్తున్న సీబీఐ దర్యాప్తు డిమాండ్‌కు ఎందుకు మద్దతు ఇవ్వటం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతల విషయంలో దూకుడుగా, ధాటిగా విమర్శలు చేసే షర్మిల కూటమి ఎమ్మెల్యేల శృతిమించిన ఆగడాలపై మాత్రం నోరెత్తటం లేదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలు తమను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని మీడియా ముందుకు వచ్చి మహిళలు కన్నీరు మున్నీరవుతున్నా షర్మిల ఆ ఎమ్మెల్యేలను పల్లెత్తు మాట కూడా ప్రశ్నించడం లేదు. ఇటీవల అనంతపురం ఎమ్మెల్యే సినీ నటుడు ఎన్టీఆర్, ఆయన తల్లి పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా షర్మిల నుంచి స్పందన కరువైంది.
కరేడు రైతుల కష్టాలు పట్టవా?
సోలార్ పవర్ ప్లాంట్ కోసం తమ భూములను ఊరితో సహా లాగేసుకుంటున్న ప్రభుత్వంపై కరేడు రైతులు తీవ్రస్థాయిలో ఉద్యమించారు. ఆ రైతులకు అండగా కొంతమంది కాంగ్రెస్ నేతలు అండగా నిలబడి రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. కరేడు రైతుల భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేశారు. అయితే పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మాత్రం కరేడు భూ సేకరణపై ప్రభుత్వాన్ని నిలదీయలేదు. ఘాటైన పదజాలంతా విరుచుకుపడలేదనీ ముందుండి ఉద్యమాన్ని నడిపించలేదని కాంగ్రెస్ నేతలే షర్మిలను విమర్శిస్తున్నారు.
జలయజ్ఞ ఫలాలపై పేటెంట్ వదిలేస్తున్నారు
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన జలయజ్ఞ ఫలాలు నేటికి సాకారం అవుతుంటే ఆ క్రెడిట్ మరో ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటున్నా షర్మిల మాట్లాడటం లేదు. హంద్రీనీవా ప్రాజెక్టుకు కృషి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాలను ఆమె ప్రజలకు గుర్తు చేయడం లేదు. దీనిపై కాంగ్రెస్ మద్దతుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గమైన కుప్పానికి కృష్ణా నది నీళ్లు రావడం వెనుక అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తో పాటు ఆయన తర్వాత సీఎంలుగా కొనసాగిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల ప్రమేయం కూడా ఉంది. ఆ తర్వాత సొంత పార్టీతో అధికారంలోకి వచ్చిన ఆమె అన్న జగన్ ప్రభుత్వంలో కూడా పనులు జరిగాయి. ఆ ఫలితమే నేడు కుప్పానికి కృష్ణా నది నీళ్లు రావడమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు కానీ ఆ క్రెడిట్ ను వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఆపాదించటం లేదని కాంగ్రెస్ అభిమానులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ఇప్పటికైనా షర్మిల తన కోసం కాకుండా పార్టీ కోసం కష్టపడాలని సూచిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం డాక్టర్ వైఎస్ఆర్‌లో ఇష్టపడే గుణం స్నేహమని, తనను నమ్మి తన వెంట నడిచిన వారి కోసం ఎందాకైనా తెగించి నడిచే స్వభావం వైఎస్ షర్మిలలో కనిపించడం లేదని ఆమెను దగ్గరగా చూసినవారు అభిప్రాయ పడుతున్నారు. పార్టీని పటిష్టం చేయడానికి సొంత పార్టీ నేతలతో పాటు ఇతర రాజకీయ పార్టీలలోని నేతలతో కూడా వైయస్సార్ సామరస్యంగా మెలిగే వారిని అవసరమైన చోట అందరిని కలుపుకుపోయే వారని, ఆ గుణాలేవి షర్మిలలో కనిపించడం లేదని పెదవి విరుస్తున్నారు.
ప్రధాన మంత్రిగా రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీని భారత ప్రధానమంత్రిగా చూడాలన్నది తన తండ్రి వైఎస్ఆర్ ఆశయమని ఆ లక్ష్యాన్ని సాధించడానికి తాను కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నట్లు ప్రకటించిన షర్మిల ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం ఏపీలో చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. మరో సరిహద్దు రాష్ట్రం తమిళనాడులో ఇండియా కూటమిలోని డీఎంకే పార్టీ అధికారంలో ఉంది. అయినా షర్మిల మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదన్న విమర్శలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. కనీసం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కూడా ఆమె ఆంధ్రప్రదేశ్‌లో కార్యక్రమాలు నిర్వహించలేదని.. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో రాజీవ్ కి ఆ రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు ఘనంగా నివాళులు అర్పించారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఓటమిపై ఘాటు విమర్శలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఘోర ఓటమిపాలై 11 స్థానాలకు పరిమితమవటంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలా రెడ్డి చేస్తున్న విమర్శలు సొంత పార్టీలోనే విమర్శలకు దారితీస్తున్నాయి. ఓడిపోయారు సిగ్గు లేదా, ప్రజలు ఛీత్కరించారు.. అంటూ పరుష విమర్శలు జాతీయ పార్టీకి సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజమని, ఒక ప్రాంతీయ పార్టీ స్థాయిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు మాట్లాడటం సముచితంగా లేదని అంటున్నారు. ఎంతో రాజకీయ ఘన కీర్తి కలిగిన కాంగ్రెస్ పార్టీ సైతం పలుమార్లు ఓటమి పాలైందని ఆమెకు గుర్తు చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఘన విజయాలు చవిచూసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత కనీసం ఒక్క స్థానం కూడా ఇప్పటివరకు గెలవలేదని, జాతీయ స్థాయిలోనూ వరుసగా మూడుసార్లు ఘోరంగా ఓడిందన్న విషయాన్ని షర్మిల గుర్తుంచుకోవాలని అంటున్నారు. ప్రధానిగా రాహుల్ గాంధీని చూడాలంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల పనితీరు అత్యంత కీలకమని అందులోనూ ఆంధ్రప్రదేశ్ లాంటి రాజకీయ చైతన్యం కలిగిన రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని షర్మిలకు సూచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో దివంగత మాజీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని దక్కించుకున్న షర్మిలా రెడ్డి రాష్ట్ర విభజనతో ఏపీలో కను మరుగైన కాంగ్రెస్ ను బలోపేతం చేస్తుందని, గాంధీ కుటుంబం పెట్టుకున్న కొండంత ఆశను నిలబెట్టుకోవాలని, హై కమాండ్ ఆమెపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టు కోవాలంటే కచ్చితంగా ఆమె పని తీరును మెరుగు పరుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ అభిమానులు సూచిస్తున్నారు.






