- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చకండి.. మరోసారి ప్రభుత్వానికి వైఎస్ షర్మిల హెచ్చరిక
19 ఏళ్ల ఆరోగ్యశ్రీ చరిత్రలో నేడు దుర్దినం అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: 19 ఏళ్ల ఆరోగ్యశ్రీ (Aarogyasri) చరిత్రలో నేడు దుర్దినం అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Y. S. Sharmila) పేర్కొన్నారు. చేసిన వైద్యానికి బిల్లుల ఇవ్వాలని ఆసుపత్రులు (Hospitals) రోడ్డెక్కడం విచారకరమని గురువారం ఎక్స్ వేదికగా ఆమె వెల్లడించారు. రూ. 2700 కోట్లు బకాయిలు పెట్టడం దుర్మార్గమని, ఇంత జరుగుతున్నా మౌనం వహించడం సీఎం చంద్రబాబు మూర్ఖపు చర్యకు నిదర్శనమని విమర్శించారు. వైద్యం అందక జనం గగ్గోలు పెడుతుంటే చోద్యం చూడటం అత్యంత దారుణమన్నారు. 15 రోజులుగా (Aarogyasri services) ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేసి లక్షమంది రోగులను తిప్పి పంపించారని, సర్జరీలు జరగక పేదలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన చెందారు. అయినా బిల్లుల చెల్లింపునకు కూటమి ప్రభుత్వానికి మనసు కరగలేదన్నారు. వారి ఆర్తనాదాలకు పట్టింపు లేదని, ఇది ఆరోగ్యశ్రీ ని నిర్వీర్యం చేసి పూర్తిగా చంపే కుట్రనే అని ఆరోపించారు.
పేదోడికి ఉచిత వైద్యం దూరం చేయాలని చూడటమే.. వైద్యం కోసం మళ్ళీ ఆస్తులు అమ్ముకోవాలని చెప్పకనే చెప్తున్నారని ఆరోపించారు. బకాయిల చెల్లింపునకు ప్రభుత్వమే బేరసారాలకు దిగడం సిగ్గుచేటని విమర్శించారు. చేసిన వైద్యానికి బిల్లులు పెండింగ్ పెట్టడం కూటమి ప్రభుత్వ దిక్కుమాలిన చర్యకు అద్దం పడుతుందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుని కాంగ్రెస్ పార్టీ పక్షాన మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. స్ట్రెచర్ పైనున్న ఆరోగ్యశ్రీ భారాన్ని వెంటనే దించాలని డిమాండ్ చేశారు. సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చకండని హితువు పలికారు. ‘పథకానికి రాజకీయాలను ఆపాదించకండి. రూ. 250 కోట్లు ఇచ్చినంత మాత్రానా ప్రజారోగ్యంపై మీకు ప్రేమ ఉన్నట్లు కాదు. చిల్లర విదిలించి చేతులు దులపాలని చూడటం భావ్యం కాదు. వెంటనే రూ. 2700 కోట్లు విడుదల చేయాలి. ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ అందక రాష్ట్రంలో ఏ ఒక్కరు మృత్యువాత పడినా అవి ప్రభుత్వం చేసిన హత్యలుగానే పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు.






