- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
11 ఏళ్లు అవుతున్నా ఏం చేస్తున్నారు?.. రాష్ట్ర ఎంపీలపై వైఎస్ షర్మిల ఫైర్
రాష్ట్ర ఎంపీలపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంట్ సమావేశాల వేళ రాష్ట్ర ఎంపీలు మౌనంపై వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రం నుంచి 25 మంది లోక్ సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారని, రాష్ట్ర హక్కులపై మాట్లాడుతారని చూస్తున్నామని, ఏమీ మాట్లాడకుండా బుద్ధుమంతులుగా కూర్చుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. విజయవాడ కాంగ్రెస్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. మోడీ మాట్లాడితే పోటీపడి చప్పట్లు కొడుతున్నారని విమర్శించారు. విభజన హక్కులు నెరవేరక 11 ఏళ్లు అయ్యిందని గుర్తు చేశారు. విభజన హామీలు ఆంధ్ర ప్రజల హక్కులని, మరి ఈ విషయం ఎంపీలకు గుర్తుకు ఉందో లేదో తెలియదన్నారు. లేకపోతే గుర్తు లేనట్లు నటిస్తున్నారో అర్ధం కావడం లేదని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే ఎంపీలకు సొంత రాజకీయాలు ముఖ్యమని విమర్శించారు. హామీలు, హక్కుల మీద పోరాటం కంటే మోడీ మెప్పు వీరికి మిన్నఅని మండిపడ్డారు. ఎంపీలుగా ఢిల్లీలో పదవులు అనుభవిస్తున్నారని, నిజానికి బీజేపీకి బినామీ ఎంపీలని వ్యాఖ్యానించారు. మోడీ చేతుల్లో రబ్బర్ స్టాంప్స్ అని, కీలుబొమ్మలు అని విమర్శించారు. 11 ఏళ్లుగా ఏ ఒక్క విభజన హామీ నెరవేరలేదని, అయినా రాష్ట్ర పార్టీలకు,ఎంపీలకు పట్టింపు లేదని మండిపడ్డారు. విభజన హామీలపై ఒక్కరు నోరువిప్పడం లేదని, 2014లో విభజన చట్టం రూపొందించారని గుర్తు చేశారు. ఇందులో ప్రత్యేక హోదా 5 ఏళ్లు ఇవ్వాలని హామీ ఇచ్చారని, పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారని పేర్కొన్నారు. ఏపీ రాజధాని కేంద్రం కడుతుంది అని చెప్పారని, కడప స్టీల్,దుగరాజపట్నం పోర్ట్ నిర్మాణం కేంద్రం హామీ అని, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చెప్పారు. విభజన హామీల్లో ఇప్పటి దాకా 5 శాతం కూడా నెరవేరలేదని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
‘‘95 శాతం హామీలు తుంగలో బీజేపీ తొక్కింది. విభజన హామీలు రాష్ట్రానికి రావాల్సిన న్యాయపరమైన హామీలు. విభజన చట్టం పకడ్బందీగా తయారు చేశారు. ఇంతటి చట్టం ఎందుకు అమలు అవ్వడం లేదు?. చట్టబద్ధత ఉన్నప్పుడు ఎందుకు పోరాటం చేయడం లేదు?. మన రాష్ట్రానికి విభజన హామీలు అవసరం లేదా?. మన బిడ్డలు బాగుపడాలని నాయకులకు లేదా?. రాష్ట్ర ప్రజల బాగు కోసం ఎంపీలు ఎందుకు నిలబడటం లేదు?. మోడీ మోసం చేస్తుంటే ఎందుకు భజన చేస్తున్నారు?. అహో మోడీ, ఓహో మోడీ..డబుల్ ఇంజన్ లు...విజన్ లు..వంకాయలు అని పొగడటం ఏంటి?. ఎంపీలుగా మీకు చీమ కుట్టినట్లు కూడా లేదా ?. ప్రజలు ఓట్లు వేస్తే విభజన హామీల మీద ఎందుకు మాట్లాడటం లేదు?. విభజన హామీల మీద పోరాటాలు ఏవీ?. ఎంతసేపు బీజేపీ బిల్లులకు గొర్రెలా తల ఊపుతున్నారు. తిరుపతి వేదికగా మోడీ 10 ఏళ్లు హోదా ఇస్తాం అన్నారు. 11 ఏళ్లు దాటినా హోదా అంశం పట్టింపు లేదు. హోదా ఈ 10 ఏళ్లు వచ్చి ఉంటే రాష్ట్రం అగ్రస్థానంలో ఉండేది. మోడీ హోదా విషయంలో మోసం చేస్తే...సంజీవనా అని చంద్రబాబు మోసం చేశారు. మెడలు వంచి హోదా తెస్తాం అన్న జగన్ మోదీకి మెడలు వంచి నమస్కారం చేస్తున్నాడు. హోదా అంటే చివరికి బూతుపదంగా మార్చారు. ఇంగ్లీష్ డిక్షనరీ నుంచి హోదా అనేది లేనట్లు వ్యవహరిస్తున్నారు.’’ అని వైఎస్ షర్మిల మండిపడ్డారు.






