బొత్స అనూష ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు..

by Naga Rani Yarlagadda |

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు..

బొత్స అనూష ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు..
X

దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఉమ్మడి విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. గరివిడిలో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ మాట ఇస్తే మడమ తిప్పని నేతగా పేదప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు. బలహీన వర్గాలకు విస్తృతంగా సంక్షేమ పథకాలను అందించి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని తెలిపారు.

మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు సక్సెస్ కావడంతో ఓర్చుకోలేక కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఉపాధిహామీ నిధులను దారిమళ్లించి పేదవాడి నోటి దగ్గరి కూడును లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. పేదలకు అన్యాయం చేస్తే సహించబోమని హెచ్చరించారు.

డాక్టర్ బొత్స అనూష మాట్లాడుతూ..జగన్ జన్మదిన వేడుకలను ఇంత ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని, రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాన శిబిరానికి ప్రజలు స్వచ్చందంగా తరలివచ్చారని, సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లడం సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. జగనన్న మళ్లీ అధికారంలోకి వచ్చి.. తమ జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రజలు దేవుడిని ప్రార్థిస్తున్నారని తెలిపారు. డాక్టర్ బొత్స సందీప్ మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ యువతకు ఆదర్శప్రాయులని చెప్పారు. నిరుపేద కుటుంబాలను పలుకరిస్తే.. మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Next Story