- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూటమి నేతలవన్నీ అసత్య ప్రచారాలంటున్న వైయస్ జగన్
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బ్రాండ్ ఏపీ (Brand AP) దెబ్బతినిందని కూటమి నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ (YS Jagan) విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్ : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బ్రాండ్ ఏపీ (Brand AP) దెబ్బతినిందని కూటమి నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ (YS Jagan) విమర్శించారు. ఎక్స్ వేదికగా గణాంకాలతో సహా ప్రచారాలను ఆయన తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. తమ పాలనలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిపై ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. బ్రాండ్ ఏపీ దెబ్బతినిందనే మాటలు కేవలం ఆరోపణలనేనని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని విడిచి వెళ్లడానికి వైసీపీ పాలన కారణమని.. పారిశ్రామిక వృద్ధి తమ పార్టీ కారణంగానే కుంటుపడిందని కూటమి నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. వాస్తవానికి తమ పాలన కారణంగా ఏపీ ఆర్థికంగా ఎంతో బలోపేతమైందని ఆయన స్పష్టం చేశారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ నెల విడుదల చేసిన అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ జగన్ కీలక వివరాలను వెల్లడించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో మ్యానుఫ్యాక్చరింగ్ (Manufacturing) రంగ వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారతదేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. జాతీయ స్థాయిలో ఐదో స్థానాన్ని కైవసం చేసుకుందని ఆయన పేర్కొన్నారు. కేవలం తయారీ రంగమే కాకుండా.. పారిశ్రామిక రంగ వృద్ధిలో కూడా రాష్ట్రం దక్షిణాదిలో అగ్రస్థానంలో ఉంటూ దేశవ్యాప్తంగా ఎనిమిదో ర్యాంకును సొంతం చేసుకుందని వివరించారు. ఈ గణాంకాలే తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పారిశ్రామిక ప్రగతికి నిలువెత్తు సాక్ష్యాలని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం చేస్తున్నవి కేవలం రాజకీయ విమర్శలే తప్ప, అభివృద్ధికి సంబంధించినవి కావని జగన్ విమర్శల వర్షం కురిపించారు. తమ హయాంలో గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (GVA) పెరుగుదల రాష్ట్రం సాధించిన ఆర్థిక పురోగతిని సూచిస్తుందని తెలియజేశారు. ఇది 'బ్రాండ్ ఏపీ' విధ్వంసం కాదని.. పారదర్శకమైన నాయకత్వంలో జరిగిన 'బూమింగ్ ఎకానమీ' అని ఆయన అభివర్ణించారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకొని, వాస్తవాలను గుర్తించాలని ఆయన హితవు పలికారు.






