కాశీబుగ్గ ఘటనను మరిపించేందుకు జోగి రమేష్ అరెస్ట్ : వైఎస్ జగన్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-02 06:24:05  IST  )

నిన్న కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు నేడు జోగి రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు.

కాశీబుగ్గ ఘటనను మరిపించేందుకు జోగి రమేష్ అరెస్ట్ : వైఎస్ జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: నిన్న కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు నేడు జోగి రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్(X)లో ప్రభుత్వ వైఫల్యాలు వర్సెస్ డైవర్షన్ పాలిటిక్స్ పేరుతో వీడియో షేర్ చేశారు. జోగి రమేష్ అరెస్ట్ అక్రమమని, ఆయన అరెస్టును ఖండిస్తున్నానని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే నకిలీ మద్యం తయారు చేసి.. ఇప్పుడు తమ పార్టీవారిపై బురదజల్లి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. మొంథాతుపాన్, కాశీబుగ్గ ఘటనల్లో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా కుట్ర పన్నారని ఆరోపించారు.

నకిలీ మద్యం వ్యవహారంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని, అందుకే సీబీఐ విచారణ జరిపించాలని పిటిషన్ వేసిన మర్నాడే జోగి రమేష్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. నకిలీ మద్యంలో వారి ప్రమేయమే లేకపోతే సీబీఐ ఎంక్వైరీకి భయమెందుకని జగన్ ప్రశ్నించారు

"నారా చంద్రబాబు నాయుడు గారూ.. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు. జోగిరమేష్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.

గత 18 నెలలుగా ప్రభుత్వం మీది పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డవారిలో మీ పార్టీనుంచి ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు, మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ, అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే.

మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది, మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్‌ షాపుల్లోనే, మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టుషాపుల్లోనే, పర్మిట్‌ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీవారు, అమ్మేదీ మీరే, కాని బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని.

నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదోవపట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగిరమేష్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసిన మరుసటిరోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబుగారు.. మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోంది. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబుగారూ? ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీ జేబులో ఉన్న సిట్‌ మీరు ఏం చెప్తే అది చేస్తుంది. మీరు సిట్‌ అంటే సిట్‌.. స్టాండ్‌ అంటే స్టాండ్‌. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలం." అని జగన్ ఎక్స్ లో చేసిన పోస్టులో పేర్కొన్నారు.

Next Story