‘యోగాంధ్ర’ సూపర్ హిట్ అయింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-21 07:14:37  IST  )

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖ‌పట్నంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం సూపర్ హిట్ అయిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

‘యోగాంధ్ర’ సూపర్ హిట్ అయింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖ‌పట్నంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం సూపర్ హిట్ అయిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కాసేపటి క్రితం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా తాము మొదటిసారి నిర్వహించిన యోగాంధ్ర ఈవెంట్‌కు రెండు గిన్నిస్ బుక్ రికార్డులు నెలకొల్పడం సంతోషకరమని అన్నారు. ప్రజల సహాకారంతోనే యోగాంధ్రను విజయవంతం చేశామని అందుకు ప్రకృతి కూడా సహరించిందని తెలిపారు. సూర్య నమస్కారాతో గిరిజన బిడ్డలు చరిత్ర సృష్టించారని.. యోగాంధ్ర సూపర్ హిట్ అయిందని అన్నారు. ఇవాళ్టి కార్యక్రమంలో 3.3 లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఫలించిందని అన్నారు. యోగా అందరికీ అవసరం అనే భావన తీసుకొచ్చింది మోడీనే అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 11వ యోగా డే విశాఖ డిక్లరేషన్‌ తీసుకొస్తామని.. యోగా పరిషత్‌ను ఏర్పాటు చేస్తామని, ఆరోగ్యానికి యోగానే గేమ్ ఛేంజర్ అని సీఎం చంద్రబాబు అన్నారు.

కొంతమంది నాయకుల గురించి ఆలోచించడం వేస్ట్..

ప్రకృతి విపత్తులు ఎప్పుడూ చెప్పి రావని.. హుద్ హుద్ తుఫాన్ సమయంలో ప్రభుత్వంలో ఉన్న తాము యుద్ధ ప్రాతిపదికన పని చేశామని అన్నారు. విశాఖకు తనకు ప్రత్యేక అనుబంధం ఉందని.. మంచి పని చేస్తే ఇక్కడి ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని వ్యాఖ్యనించారు. యోగా డే వేడులకు ఒక్క పిలపునిస్తే.. లక్షల్లో జనం తరలివచ్చారని అన్నారు. విశాఖ ప్రజలది పాజిటివ్ థింకింగ్ అని.. సమైక్యతా భావం ఎక్కువని కితాబిచ్చారు. కొంతమంది నాయకుల గురించి ఆలోచించడంతో సమయం వృథా అంటూ జగన్‌ను ఉద్దేశించి సెటైర్లు వేశారు. విశాఖ రైల్వే జోన్ సరైన సమయంలో ట్రాక్‌లోకి వచ్చిందని గుర్తు చేశారు. చాలా కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతుండటం ఆనందదాయకమని అన్నారు.

ముంబై నమూనాలో విశాఖ అభివృద్ధి పనులు..

ఏపీ గేమ్ ఛేంజర్ పొలవరం ప్రాజెక్ట్ పనులు పరుగులు పెడుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ మెట్రో పనులు కూడా త్వరలోనే మొదలు కాబోతున్నాయని.. ముంబై నమూనాలో విశాఖ అభివృద్ధి పనులు చేపడుతామని స్పష్టం చేశారు. విశాఖ అభివృద్ధి కోసం ప్రత్యేక విజన్ తయారు చేశామని, 4 ఉమ్మడి జిల్లాలకు ఎకనమిక్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. అందుకు ఓ ప్రత్యేక సంస్థను అభివృద్ధి సంస్థను తీసుకొస్తామని అన్నారు. నీతి ఆయోగ్ విజన్ డాక్యుమెంట్ కూడా విడుదల చేస్తామని తెలిపారు. అమరావతితో పాటు రాయలసీమను కూడా ఎకనామిక్ కారిడార్‌లుగా మారుస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.

Next Story