- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యోగాంధ్ర 2025కి సర్వం సిద్ధం.. సాగరతీరంలో అపూర్వ ఘట్టం
జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "యోగాంధ్ర 2025" (Yogandhra 2025) అనే విభిన్నమైన యోగా ఉత్సవాన్ని విశాఖ సాగరతీరంలో అత్యున్నత స్థాయిలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "యోగాంధ్ర 2025" (Yogandhra 2025) అనే విభిన్నమైన యోగా ఉత్సవాన్ని విశాఖ సాగరతీరంలో అత్యున్నత స్థాయిలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననుండగా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy cm Pawan Kalyan) కూడా యోగా ప్రదర్శనలో భాగస్వాములు కానున్నారు. దాదాపు ఐదు లక్షల మందితో ఒకే వేదికపై యోగా సాధన చేయించేందుకు అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు, దీనివల్ల గిన్నిస్ రికార్డు (Guinness Record) సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు.
34 కి.మీ సాగరతీరాన్ని యోగా రంగస్థలంగా మార్చిన విశాఖ
ఆర్కే బీచ్ (RK Beach)లోని కాళీమాత ఆలయం నుంచి భోగాపురం (Bhogapuram) వరకు 34 కిలోమీటర్ల పొడవున బీచ్ రోడ్డుని యోగా ప్రాంగణంగా మలచారు. మొత్తం 326 సెగ్మెంట్లుగా విభజించి, ప్రతి 40 అడుగులకు ఒక చిన్న వేదికను ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనదలచిన వారందరూ ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకొని క్యూఆర్ కోడ్ ద్వారా ప్రవేశం పొందాల్సి ఉంటుంది. వారికి యోగా మ్యాట్లు, టీ షర్టులు ఉచితంగా అందజేస్తారు. జూన్ 20 నుంచి బీచ్ రోడ్డులో ట్రాఫిక్‌ను నిలిపివేశారు.
రూ.62 కోట్లతో విస్తృత ఏర్పాట్లు
ఈ మెగా ఈవెంట్ కోసం సుమారు 62 కోట్ల బడ్జెట్‌ను వెచ్చించారు. 3 వేల తాత్కాలిక మరుగుదొడ్లతో పాటు ప్రతి ఐదు సెగ్మెంట్లకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక వద్ద పది పడకల ఆసుపత్రి నిర్మించారు. ప్రజల రాకపోకల కోసం 3,600 APSRTC బస్సులతో పాటు 7,295 ప్రైవేట్ వాహనాలను సిద్ధం చేశారు.
వర్షం వచ్చినా యోగా కొనసాగుతుంది
వాతావరణ ప్రతికూలతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) ఇంజినీరింగ్ కళాశాల మైదానాన్ని ప్రత్యామ్నాయ వేదికగా ఏర్పాటు చేశారు. అక్కడ సుమారు 20 వేల మంది గిరిజన విద్యార్థులతో ప్రత్యేక యోగా ప్రదర్శన జరగనుంది. అక్కడ కూడా తాత్కాలిక ఆసుపత్రిని అందుబాటులో ఉంచారు.
యుద్ధ నౌకలపై యోగా
ప్రధాని హాజరు నేపథ్యంలో, 10 వేల మంది పోలీసులతో భారీ భద్రత కల్పించారు. బీచ్ రోడ్డులో 2,000 సీసీ కెమెరాలను అమర్చారు. 26 మంది ప్రఖ్యాత యోగా గురువులు, 1,500 శిక్షకులు, 6,300 వాలంటీర్లు ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొననున్నారు. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో 11 యుద్ధ నౌకలపై యోగా ప్రదర్శనలు కూడా జరగనున్నాయి.
ప్రపంచ దృష్టిని ఆకర్షించే విజ్ఞాన పర్వం
ప్రధాని కాన్వాయ్ ప్రయాణ మార్గాన్ని పరిశీలిస్తూ INS డేగ నుంచి కమాండ్ గెస్ట్ హౌస్ వరకు ట్రయల్ రన్ పూర్తిచేశారు. పారిశుధ్యాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. రాష్ట్ర మంత్రి నారాయణ వెల్లడించిన మేరకు.. ఈ మహాయజ్ఞం ద్వారా యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.






