- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మానవహక్కుల సంఘానికి వైసీపీ ఫిర్యాదు
రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయని, రక్షణ కల్పించాల్సిన యంత్రాంగమే దాడులకు సహకరిస్తోందని వారు వాపోయారు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాష్ట్రంలో (AP State) ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ అశాంతి, శాంతిభద్రతల సమస్యలపై వైసీపీ (YCP) జాతీయ స్థాయిలో పోరాటానికి దిగింది. బుధవారం న్యూఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) చైర్‌పర్సన్ జస్టిస్ వి. రామసుబ్రమణియన్ ను వైసీపీ నేతల బృందం కలిసింది. రాష్ట్రంలో సాగుతున్న ఆటవిక పాలన, ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై వారు కమిషన్‌కు సమగ్రంగా ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన పెట్రోల్ బాంబు దాడులు, విధ్వంసాన్ని ఈ సందర్భంగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ భేటీలో పల్నాడు జిల్లాలో దళిత సామాజిక వర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మన్ రాజు హత్య ఉదంతాన్ని నేతలు ప్రధానంగా ప్రస్తావించారు. సాల్మన్ రాజును అతి దారుణంగా అంతమొందించిన తీరు వెనుక రాజకీయ కుట్ర ఉందని, పోలీసులు కూడా అధికార పార్టీకి కొమ్ముకాస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. దాడులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వంటి బలమైన ఆధారాలను చైర్‌పర్సన్ ముందు ప్రదర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయని వాపోయారు. రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించాల్సిన యంత్రాంగమే దాడులకు సహకరిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్ రెడ్డి, మద్దిల గురుమూర్తి నేతృత్వంలోని ఈ బృందం రాష్ట్రంలో పౌర హక్కులకు భంగం కలుగుతోందని కమిషన్‌కు వివరించింది. అంబటి రాంబాబుపై ఏకంగా 16కు పైగా అక్రమ కేసులు బనాయించారని పేర్కొంది. అలాగే జోగి రమేష్ కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు కలిగేలా దాడులు జరిగాయని పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులాల (SC) కుటుంబాలను భయాందోళనకు గురిచేస్తూ గ్రామాల నుండి తరిమివేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకుని క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రతినిధుల బృందంలో ఎంపీలు బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, తనూజా రాణిలతో పాటు మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలం సురేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు సుధాకర్ బాబు, ఎమ్మెల్సీలు ఇజ్రాయిల్, అరుణ్ కుమార్, చంద్రశేఖర్, జూపూడి ప్రభాకర్ రావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అరాచక పరిస్థితులను ఎండగట్టేందుకు తాము ఢిల్లీ వేదికగా పోరాటం కొనసాగిస్తామని, అవసరమైతే రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేస్తామని నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.





