YCP QR Code: స్కాన్​ చేయండి.. ప్లీజ్​

by Thanuru Gopichand |

ఏపీ పాలిటిక్స్ ​లో టెక్నాలజీని బాగా యూజ్ ​చేసుకుంటున్నారు.

YCP QR Code: స్కాన్​ చేయండి.. ప్లీజ్​
X

ఏపీ పరిపాలన, రాజకీయాలలో ‘క్యూఆర్ ​కోడ్’!

ప్రభుత్వ వైఫల్యాలపై క్యూఆర్​ కోడ్ ​తో వైసీపీ ప్రచారం

వైసీపీ ప్రచారాన్ని తిప్పికొడుతున్న కూటమి ప్రభుత్వం

రేషన్​ లబ్డిదారుల సేవలకు క్యూఆర్ ​కోడ్​

దిశ, డైనమిక్ ​బ్యూరో : ఏపీ పాలిటిక్స్ ​లో టెక్నాలజీని బాగా యూజ్ ​చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అప్​డేట్ ​అవుతూ ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ​ఫోన్​ ఉంది. దీని ద్వారానే ప్రభుత్వం ప్రజలకు చేరువవుతోంది. అటు అధికారం కోల్పోయిన పార్టీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆ సెల్​ఫోన్​నే మాధ్యమంగా చేసుకుంటోంది. క్యూఆర్ స్కాన్‌తో ప్రజల ముందుకు వెళ్లి చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు బయట పెడతానని నిన్నటి సమావేశంలో వైసీపీ అధినేత జగన్​ప్రకటించారు. ఒక క్యూఆర్​కోడ్​ను కూడా విడుదల చేశారు. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేద్దాం అనే ఐదు వారాల ప్రోగ్రాంను ఆయన ప్రకటించారు.

మరోవైపు ప్రభుత్వం కూడా ప్రజలకు చేరువయ్యే పథకాల్లో క్యూఆర్​కోడ్​ను ఎక్కువగా ఉపయోగించుకుంటోంది. కొత్త రేషన్​కార్డులపై క్యూఆర్​కోడ్​ను ముద్రించి విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. స్కాన్​చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు తెలిసే విధంగా వీటిని రూపొందిస్తున్నారు. తాజాగా.. ప్రతి రేషన్ డిపో వద్ద క్యూఆర్​ కోడ్ పోస్టర్లు ప్రదర్శిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్​ఈ రోజు ప్రకటించారు. లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. రేషన్ కార్డుదారులు ఆ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. అందుకోసం ఏర్పాటు చేసిన వెబ్ ఫారమ్‌లో సరైన వివరాలు నమోదు చేయగలరని సూచించారు. ఈ నెల రేషన్ తీసుకున్నారా? సరుకుల నాణ్యతపై సంతృప్తిగా ఉన్నారా? సరైన తూకంతో సరఫరా చేశారా? డీలర్ మర్యాదగా వ్యవహరించాడా? ఎటువంటి అధిక ధరలు వసూలు చేశారా? ఇలాంటి ప్రశ్నలకు అవును / కాదు అని సమాధానాలు ఇచ్చే విధంగా ఉంటుంది. పౌరుల నుంచి వచ్చిన స్పందనలు నేరుగా ఉన్నతాధికారులకు చేరి, అవసరమైనచోట్ల చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

అయితే ఈ క్యూఆర్​కోడ్​ప్రచారానికి ప్రజలు ఎంత వరకు సహకరిస్తారు.. అనే ప్రశ్న తలెత్తుతోంది. ఓ వైపు సైబర్​నేరాలు పెరిగిపోయాయి. నకలీ క్యూఆర్​కోడ్​లతో మోసాలు జరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం పదే పదే ప్రచారం చేస్తోంది కూడా..! ఈ క్రమంలో క్యూఆర్​కోడ్​ను తీసుకు వెళ్లి స్కాన్​చేయాలని కోరితే ప్రజలు స్పందిస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. గతంలో ‘మిస్​డ్​కాల్’ ​అనే ప్రచారం పార్టీ కార్యక్రమాల్లో జరిగింది. పార్టీ సభ్యత్వ నమోదు.. కార్యక్రమాలల్లో భాగస్వామ్యం కావడానికి మిస్​డ్​కాల్​ఇవ్వాలని సూచించేవారు. ఇప్పుడు ఒకడుగు ముందుకు వేసి క్యూఆర్​కోడ్​ను స్కాన్​చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమం ఎంత వరకు సక్సెస్​అవుతుందో చూడాలి...

Next Story