- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈడీ విచారణకు హాజరైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
ఆసక్తికరంగా మారిన ఏపీ లిక్కర్ స్కాం దర్యాప్తు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో సంచలనం సృష్టించిన సుమారు రూ. 3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) ఎంపీ మిథున్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానం రూపకల్పన, టెండర్ల కేటాయింపు, నిధుల మళ్లింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ, మిథున్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను పీఎంఎల్‌ఏ (PMLA) చట్టం కింద నమోదు చేస్తోందని సమాచారం. ఈ కేసులో గతంలోనే మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేయగా, ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్న సంగతి తెలిసిందే.
ఇదే కేసులో మరోవైపు ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు గురువారం విచారించారు. సుమారు 7 గంటల పాటు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ మద్యం విధానంతో తనకు నేరుగా సంబంధం లేదన్నారు. అంతా రాజ్ కసిరెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందని పేర్కొన్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారని ఆరోపించారు. షెల్ కంపెనీల ద్వారా హవాలా మార్గంలో సొమ్మును విదేశాలకు చేరవేశారనేది ఈడీ ప్రధాన అనుమానంగా పేర్కొన్నారు.
వరుసగా ఇద్దరు కీలక నేతలను ఈడీ విచారించడంతో ఈ కుంభకోణం కేసు ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని పెంచుతోంది. రానున్న రోజుల్లో మరికొందరు కీలక నేతలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.






