‘నా హోదా ఏంటో మీకు తెలియదా?’.. జైల్లో ఎమ్మెల్సీ ఓవరాక్షన్

by Gantepaka Srikanth |

రాజమండ్రి సెంట్రల్ జైలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి హల్‌చల్ చేశారు.

‘నా హోదా ఏంటో మీకు తెలియదా?’.. జైల్లో ఎమ్మెల్సీ ఓవరాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి సెంట్రల్ జైలులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి హల్‌చల్ చేశారు. తన డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించారనే ఆరోపణలపై ఇటీవల అరెస్టయి జైలుకు వెళ్లిన ఆయన, అక్కడ అధికారుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వార్తల్లో నిలిచారు. జైల్లో తనకు సాధారణ ఖైదీలా కాకుండా, ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని అనంతబాబు అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. "నేను ఎమ్మెల్సీని అన్న విషయం మీకు తెలుసా? నా హోదా ఏంటో మీకు తెలియదా?" అంటూ అధికారులపై చిందులు తొక్కినట్లు తెలుస్తోంది. గత వైసీపీ హయాంలో 2022లో ఇదే జైల్లో ఉన్న సమయంలో ఏర్పడిన పాత పరిచయాలతో, కొంతమంది సిబ్బందిపై ఆయన పెత్తనం చలాయించే ప్రయత్నం చేసినట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి.

కోర్టుకు వెళ్లమన్నా వినని మొండితనం..

జైలు నిబంధనల ప్రకారం ప్రత్యేక వసతులు కల్పించాలంటే కోర్టు నుంచి అనుమతి పత్రాలు తీసుకురావాలని అధికారులు స్పష్టం చేశారు. "మీకు ఏవైనా ప్రత్యేక సదుపాయాలు కావాలంటే కోర్టుకెళ్లి ఆదేశాలు తెచ్చుకోవాలి, మా పరిధిలో ఏమీ ఉండదు" అని అధికారులు చెప్పినప్పటికీ, అనంతబాబు మాత్రం తన హోదాను అడ్డుపెట్టుకుని అధికారులను బెదిరించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. సొంత డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు, గతంలో బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే, ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని, వారిని బెదిరిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆయన్ని మళ్లీ అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో జైలు అధికారులపై ఆయన ప్రదర్శిస్తున్న ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Next Story