వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్‌.. డ్రైవర్ హత్య కేసులో బెయిల్ రద్దు

by Ramesh Naini |   (  Updated:2026-05-13 06:40:26  IST  )

డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్‌.. డ్రైవర్ హత్య కేసులో బెయిల్ రద్దు
X

దిశ, డైనమిక్ బ్యూరో: డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఆయనకు సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేస్తూ రాజమండ్రి ప్రత్యేక న్యాయస్థానం సంచలన ఆదేశాలు జారీ చేసింది. బెయిల్‌పై బయట ఉన్న అనంతబాబు.. ఈ కేసులోని నలుగురు సాక్షులను ప్రలోభపెట్టడంతో పాటు, తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపుతానని బెదిరించినట్లు కోర్టులో ఆధారాలతో సహా నిరూపణ అయింది. బెయిల్ నిబంధనల ఉల్లంఘనను తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం ఈ మేరకు ఆయన బెయిల్ రద్దు చేసింది. ఈ కేసులో పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. సాక్షుల ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు ఏప్రిల్ 24న అనంతబాబును అరెస్టు చేయగా.. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

విచారణ ముగిసేవరకు జైలులోనే..

తాజా ఆదేశాలతో డ్రైవర్ హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు అనంతబాబు జైలుకే పరిమితం కానున్నారు. కాగా, ఈ నెల 20వ తేదీ నుంచి ఈ హత్య కేసుకు సంబంధించిన రెగ్యులర్ విచారణ ప్రారంభం కానున్నట్లు ప్రత్యేక న్యాయస్థానం వెల్లడించింది.

Next Story