ప్రపంచస్థాయి వసతులతో ఐజీఎంసీ ముస్తాబు : రూ.60 కోట్లతో మహర్దశ

by Naga Rani Yarlagadda |

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియానికి మహర్దశ రానుంది. రూ.60 కోట్ల వ్యయంతో స్డేడియంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

ప్రపంచస్థాయి వసతులతో ఐజీఎంసీ ముస్తాబు : రూ.60 కోట్లతో మహర్దశ
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్ర క్రీడా రంగానికి కీలక కేంద్రంగా ఉన్న విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం సమగ్ర అభివృద్ధి దిశగా భారీ అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.60 కోట్లతో విస్తృత ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మూడు దశలుగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం, శాప్, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్రతి దశలో ప్రత్యేక లక్ష్యాలతో పనులు చేపట్టి, స్టేడియాన్ని పూర్తిస్థాయిలో ఆధునికీకరించనున్నారు.

మౌలిక వసతుల బలోపేతం..

మొదటి దశలో స్టేడియం ప్రాథమిక నిర్మాణాన్ని పటిష్టం చేయడంపై దృష్టి సారించనున్నారు. ఇందులో ప్రధానంగా గ్రౌండ్ స్థాయి మెరుగుదల, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 400 మీటర్ల అథ్లెటిక్స్ ట్రాక్, 200 మీటర్ల వార్మప్ ట్రాక్ అభివృద్ధి, వర్షపు నీరు నిల్వ కాకుండా ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు వంటి కీలక పనులు ఉంటాయి. రెండు వాలీబాల్ సింథటిక్ కోర్టులు, నాలుగు టెన్నిస్ కోర్టులు, రెండు బాస్కెట్ బాల్ కోర్టులు, అదనంగా రాత్రి మ్యాచ్‌లు నిర్వహించేందుకు అత్యాధునిక ఫ్లడ్‌లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఎలక్ట్రానిక్ స్కోర్‌బోర్డులు, డిజిటల్ డిస్‌ప్లేలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లు కూడా ఇందులో భాగంగా ఉంటాయి. అలాగే స్టేడియం మొత్తం నిర్మాణాన్ని పరిశీలించి, పాతబడిన భాగాలను పునరుద్ధరించనున్నారు.

ప్రేక్షకుల సౌకర్యాల విస్తరణ

రెండో దశలో ప్రేక్షకుల అనుభవాన్ని మెరుగుపరచడంపై ప్రధాన దృష్టి సారించారు. మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం, ఆధునిక సీటింగ్ వ్యవస్థలు, కవర్ స్టాండ్లు, శుభ్రతా సదుపాయాలు, తాగునీటి వసతులు, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. మూడో దశలో క్రీడాకారుల శిక్షణ, ప్రదర్శనను మెరుగుపరచే సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. పరిపాలన విభాగం, అంతర్జాతీయ స్థాయి జిమ్నేషియం, ఫిట్‌నెస్ సెంటర్, ఆధునిక డ్రెస్సింగ్ రూమ్స్, రికవరీ జోన్లు, ఫిజియోథెరపీ, మెడికల్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఇందిరాగాంధీ స్టేడియం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రాముఖ్యత పొందే క్రీడా కేంద్రంగా అవతరించనుంది.

రానున్న రోజుల్లో మరిన్ని ప్రాజెక్టులు : శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో క్రీడా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని నూతన కేంద్ర ప్రాజెక్టులు రాష్ట్రానికి రావడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. క్రీడాకారుల కోసం అత్యాధునిక వసతులు, మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యమన్నారు. విజయవాడను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వ అడుగులు వేస్తుందన్నారు. బుధవారం ఉదయం స్టేడియం ఆధునికీకరణ పనులకు భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.19 కోట్లు మంజూరయ్యాయని, మొదటి విడతగా సుమారు రూ.60 కోట్ల వ్యయం అవుతుందని అంచనా అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రపంచ స్థాయి ఈవెంట్లకు వేదికగా మారనుందని తెలిపారు. స్టేడియం ఆధునికీకరణ పనులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ కేశినేని శివనాధ్, విజయవాడ తూర్పు, సెంట్రల్, పశ్చిమ ఎమ్మెల్యేలు, శాప్ అధికారులు, పాల్గొంటారని తెలిపారు.

Next Story