- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శరవేగంగా విజయవాడ ఎయిర్‌పోర్టు నూతన టెర్మినల్ పనులు: ఎంపీ వల్లభనేని
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఉన్న అత్యాధునిక నూతన టెర్మినల్ భవనం పనులు వేగంగా కొనసాగుతున్నాయని మచిలీపట్నం ఎంపీ, విజయవాడ ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ వల్లభనేని బాలశౌరి తెలిపారు..

దిశ, మచిలీపట్నం: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఉన్న అత్యాధునిక నూతన టెర్మినల్ భవనం పనులు వేగంగా కొనసాగుతున్నాయని మచిలీపట్నం ఎంపీ, విజయవాడ ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఈ ఏడాది నవంబర్ నాటికి నిర్మాణ పనులు పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధమవుతుందని ఆయన పేర్కొన్నారు. గురువారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.
ప్రస్తుతం విజయవాడ నుంచి షార్జాకు అంతర్జాతీయ విమాన సర్వీసు నడుస్తోందని, దీనికి తోడు దుబాయ్ మరియు శ్రీలంకలకు ప్రత్యక్ష విమాన సర్వీసులు ప్రారంభించాలని సంబంధిత అధికారులను కోరినట్లు తెలిపారు. దుబాయ్‌కు నేరుగా విమాన సర్వీసు ప్రారంభమైతే ప్రపంచంలోని పలు దేశాలకు, ముఖ్యంగా అమెరికా, యూరప్ దేశాలకు ప్రయాణించే వారికి మెరుగైన కనెక్టివిటీ లభిస్తుందని ఆయన వివరించారు.
దేశీయ విమాన సర్వీసుల విస్తరణపై కూడా ప్రత్యేకంగా చర్చించినట్లు పేర్కొంటూ, ప్రస్తుతం వారణాసి, కోల్‌కతా నగరాలకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని, అదేవిధంగా కోచిన్, అహ్మదాబాద్ నగరాలకు కూడా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. శబరిమల యాత్రికుల సౌకర్యార్థం కోచిన్‌కు విమాన సర్వీసు అత్యంత అవసరమని సమావేశంలో ప్రస్తావించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం విజయవాడ నుంచి ముంబైకి సాయంత్రం వేళల్లో మాత్రమే రెండు విమానాలు నడుస్తున్నాయని, వాటిలో ఒకదానిని ఉదయం వేళకు మార్చితే వ్యాపార, ఉద్యోగ, ఇతర అవసరాల నిమిత్తం ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని సూచించినట్లు ఎంపీ పేర్కొన్నారు.
విమానాశ్రయానికి రహదారి అనుసంధానాన్ని మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ఇటీవల అందుబాటులోకి వచ్చిన వెస్ట్ బైపాస్ రోడ్డును విజయవాడ విమానాశ్రయంతో అనుసంధానించేలా చిన అవుటుపల్లి మీదుగా సుమారు 7 నుంచి 8 కిలోమీటర్ల మేర కనెక్టివిటీ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేసి, కేంద్ర ప్రభుత్వ నిధుల సాధనకు కృషి చేస్తామని ఎంపీ తెలిపారు. విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలను కూడా సమావేశంలో ప్రస్తావించినట్లు పేర్కొంటూ, సుమారు 464 మంది రైతులకు చెల్లించాల్సిన రూ.29 కోట్ల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విజయవాడ విమానాశ్రయం అభివృద్ధి ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక రంగం, అంతర్జాతీయ వ్యాపార అవకాశాలు మరింత విస్తరిస్తాయని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని ఎంపీ బాలశౌరి ఆశాభావం వ్యక్తం చేశారు.






