భర్త సాయంతో దారుణానికి పాల్పడిన మహిళ.. నమ్మిన వారినే!?

by Jakkula.Mamatha |

రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

భర్త సాయంతో దారుణానికి పాల్పడిన మహిళ.. నమ్మిన వారినే!?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళకు నమ్మి పని కల్పిస్తే చివరికి యజమానిని హత్య చేసి పరారైన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఏపీ(Andhra Pradesh)లోని విజయవాడ(Vijayawada)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి వెంకట రామారావు(70) తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నారు. ఇద్దరే ఉండడంతో తల్లిని చూసుకునేందుకు ఓ పని మనిషి కావాలని అతను నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం అనూష అనే మహిళను పని మనిషిగా పెట్టుకున్నారు. తన తల్లికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని ఆమెకు సూచించాడు. ఈ క్రమంలో అనూష కూడా వారితోనే ఉంటుంది.

ఇదిలా ఉంటే.. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రామారావు గదిలో లైట్లు వెలగడంతో తల్లి సరస్వతి వచ్చింది. ఒక్కసారిగా మంచం పై అపస్మారక స్థితిలో పడి ఉన్న రామారావును చూసి ఆమె భయాందోళనకు గురయ్యారు. రామారావు పై కారం చల్లి ఉంది. ఈ క్రమంలో సరస్వతికి ఏం చేయాలో తోచకపోవడంతో.. ఆ ఇంట్లో వారితోనే ఉంటున్న పనిమనిషి అనూషను పిలిచింది. పనిమనిషి ఎంత పిలిచినా పలకలేదు. ఎక్కడ వెతికిన ఆమె జాడ లేదు. బీరువా పగలగొట్టి ఉంది. ఈ క్రమంలో అనుమానంతో రామారావు తల్లి పక్క ఇంటి వాళ్లను పిలిచి వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మాచవరం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో పనిమనిషి అనూషను ఈ రోజు(శుక్రవారం) ఉదయం 6 గంటల సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితురాలు తన భర్త సాయంతో రామారావు ముఖం పై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story