Nagababu: అన్నకు ప్రేమతో.. ఏ పదవి వరించునో?

by Thanuru Gopichand |

ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత తమ్ముడు పవన్​కల్యాణ్​తో అన్న ఎమ్మెల్సీ నాగబాబు భేటీ అయ్యారు.

Nagababu: అన్నకు ప్రేమతో.. ఏ పదవి వరించునో?
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత తమ్ముడు పవన్​కల్యాణ్​తో (Pawan kalyan)అన్న ఎమ్మెల్సీ నాగబాబు (Nagababu) భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం విజయవాడలో ఈ భేటీ జరిగింది. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా పవన్​ను నాగబాబు కలిశారు. ఆయనకు పవన్ కల్యాణ్​శుభాకాంక్షలు తెలిపారు. నిన్న నాగబాబు ముఖ్యమంత్రి చంద్రబాబును (Chandrababu)కలిశారు. చంద్రబాబు, పవన్​ఏ బాధ్యత ఇస్తే దానిని చిత్తశుద్ధితో నెరవేరుస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామంటూ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ప్రక్రియ ఉగాది నాటికి పూర్తవ్వాల్సి ఉన్నా అది వాయిదా పడింది. అదేవిధంగా నిన్న నాగబాబు, చిరంజీవిని కూడా కలిశారు. ఆ తర్వాత ట్విట్టర్​ఒక పోస్టు చేశారు. అన్నయ్యా.. మీ ప్రేమ, మద్దతుకు కృతజ్ఞుడిని అని అందులో పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ అయితే ఆయనకి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై జన సైనికుల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తే అది ఓ రికార్డు అవుతుంది. గతంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేశారు. తమ్ముడు పవన్​కల్యాణ్​ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే ఒకే కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు మంత్రి పదవులు నిర్వహించిన రికార్డు నమోదవుతుంది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లోనే తన గళాన్ని వినిపిస్తున్నారు. ఇక నుంచి ఎమ్మెల్సీగా శాసనమండలి ప్రజల పక్షాల మాట్లాడే అవకాశం ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. ఇప్పుడిప్పుడే కేబినెట్​లో మార్పులు చేసే అవకాశం లేదని చెబుతున్నారు. మరికొంత ఆలస్యంగా అయినా నాగబాబుకు మంత్రి పదవి వరిస్తుందని జనసేన అభిమానులు భావిస్తున్నారు

Next Story