హామీ నెరవేర్చా.. శెట్టి బలిజలకు అండగా ఉంటా : మంత్రి నారా లోకేష్

by Naga Rani Yarlagadda |

విశాఖ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకల్లో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

హామీ నెరవేర్చా.. శెట్టి బలిజలకు అండగా ఉంటా : మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో శెట్టి బలిజలందరికీ తాను అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. సోమవారం శెట్టిబలిజల ఆరాధ్యదైవం, శెట్టిబలిజ సంఘ వ్యవస్థాపకులు, సంఘ సంస్కర్త అయిన దివంగత దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా విశాఖ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో బీసీలను.. ముఖ్యంగా శెట్టిబలిజలను టార్గెట్ చేసి వేధించారని ఆరోపించారు. యువగళం పాదయాత్రలో తనను కలిసిన శెట్టిబలిజ సోదరులు.. దొమ్మేటి జయంతిని రాష్ట్ర పండుగగా చేయాలని కోరారని, ప్రజా ప్రభుత్వంలో వారికిచ్చిన మాటను నిలబెట్టుకున్నానని తెలిపారు. నేడు దొమ్మేటి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు.

బ్రిటిష్ వారి పాలనలో సాధారణ వ్యక్తిగా బర్మాకు వలస వెళ్లిన ఆయన.. షిప్పింగ్ వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. అక్కడే బర్మా మేయర్ గా సేవలందించారని గుర్తు చేసుకున్నారు. శెట్టిబలిజల కష్టాలను చూసి.. వారిలో చైతన్యాన్ని నింపేందుకు శెట్టిబలిజ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. పిల్లల కోసం స్కూళ్లు, నైట్ స్కూళ్లు ప్రారంభించారని తెలిపారు. ఆ తర్వాత ఇండియాకు తిరిగివచ్చి బోడసకుర్రు జమీందార్ గా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని, అంతేకాక స్కూళ్లు, కాలేజీలు, లైబ్రరీల కోసం తన సొంతభూములు, నిధులు విరాళాలుగా ఇచ్చారని గుర్తుచేశారు. రానున్న ఆరునెలల్లో బోడసకుర్రులో దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, శెట్టిబలిజల కోసం రాష్ట్రమంతటా కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తామని నారా లోకేష్ ప్రకటించారు. అలాగే బోడసకుర్రు బ్రిడ్జికి దొమ్మేటి పేరు పెట్టే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

Next Story