- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐటీలో హైదరాబాద్‌ను మించిపోతాం.. గూగుల్ ‘ఏఐ శక్తి కాన్‌క్లేవ్’లో మంత్రి లోకేశ్ కీలక వ్యాఖ్యలు
రాబోయే పదేళ్లలో ఐటీ రంగంలో హైదరాబాద్ కంటే విశాఖపట్నాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే పదేళ్లలో ఐటీ రంగంలో హైదరాబాద్ కంటే విశాఖపట్నాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. గూగుల్ సంస్థ ఆధ్వర్యంలో విశాఖలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ‘ఏఐ శక్తి కాన్‌క్లేవ్’లో మంత్రి లోకేశ్, గూగుల్ వైస్ ప్రెసిడెంట్ బికాశ్ కొలే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. విశాఖ భవిష్యత్ ఐటీ ముఖచిత్రాన్ని, ప్రభుత్వ లక్ష్యాలను ఆవిష్కరించారు.
నాడు కంప్యూటర్ తిండి పెడుతుందా అన్నారు..
గతంలో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో సైబర్ టవర్స్ నిర్మించినప్పుడు వచ్చిన విమర్శలను మంత్రి లోకేశ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘ఆనాడు సైబర్ టవర్స్ కడుతుంటే.. కంప్యూటర్లు తిండి పెడతాయా? అని ఎంతోమంది ఎద్దేవా చేశారు. కానీ, నేడు ఐటీ రంగం సాధించిన ప్రగతి, ఆనాడు నాటిన ఐటీ బీజం అందించిన ఫలాలు అందరికీ కళ్లెదుటే కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఆనాటి ప్రగతిని మించి ఎంతో వేగంగా దూసుకుపోనుంది’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పదేళ్ల వ్యవధిలోనే విశాఖను అత్యుత్తమ ఐటీ హబ్‌గా మారుస్తామన్నారు.
దేశ పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే..
ఐటీ, ఏఐ రంగాలకు ఊతమిచ్చేలా విశాఖలో పూర్తిస్థాయి ‘ఎకో సిస్టమ్’ను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ‘కేవలం డేటా సెంటర్లను తీసుకురావడమే కాదు, వాటి నిర్వహణ కూడా మాకు అత్యంత కీలకం. రాష్ట్రానికి భారీగా పరిశ్రమలను రప్పించి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రతి పరిశ్రమకు ప్రభుత్వ సంపూర్ణ అండదండలు ఉంటాయి. ప్రస్తుతం దేశానికి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తుండటం విశేషం. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు, సంస్థల పురోగతిపై ప్రతి వారం నిశితంగా సమీక్షలు చేపడతాం’ అని లోకేశ్ స్పష్టం చేశారు.
ప్రపంచ ఏఐ రంగాన్ని శాసించే శక్తిగా ఏపీ: గూగుల్ వీపీ
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూగుల్ వైస్ ప్రెసిడెంట్ బికాశ్ కొలే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి లోకేశ్ విజన్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగాన్ని శాసించే అపార శక్తిగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తోందని ఆయన కొనియాడారు. మంత్రి లోకేశ్ నాయకత్వంలో ఏపీలో డేటా, ఏఐ రంగాలు అనూహ్యమైన అభివృద్ధిని సాధిస్తాయని బికాశ్ కొలే ఆశాభావం వ్యక్తం చేశారు.
-----
ఐటీలో హైదరాబాద్‌ను మించిపోతాం.. పదేళ్లలో గ్లోబల్ ఐటీ హబ్‌గా విశాఖ!
గూగుల్ 'ఏఐ శక్తి కాన్‌క్లేవ్'లో మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
నాడు సైబర్ టవర్స్‌పై ఎద్దేవా చేసినవారే నేడు ఆశ్చర్యపోతున్నారు






