భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.. అరెస్ట్

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సమీపంలోని పాతచెరువు గ్రామంలో గతేడాది జరిగిన ఒక ఘోర హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ...

భర్తను హత్య చేసి పూడ్చిపెట్టిన భార్య.. అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా(Ananthapur District) కళ్యాణదుర్గం(Kalyanadurgam) సమీపంలోని పాతచెరువు(Pathacheruvu) గ్రామంలో గతేడాది జరిగిన ఒక ఘోర హత్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భర్త హనుమంతు కూలి పనికి వెళ్లి తిరిగి రాలేదని ఇన్నాళ్లూ అందరినీ నమ్మించిన భార్య బోయ సుకన్య (34), అసలు నిజాన్ని తన పెరట్లోనే పాతిపెట్టింది. నిత్యం మద్యం తాగి తనపై అనుమానంతో గొడవ పడుతున్నాడనే కోపంతో, గత నవంబర్ 10న సుకన్య తన మైనర్ కుమార్తెతో కలిసి హనుమంతును రోకలిబండతో కొట్టి ప్రాణాలు తీసింది. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంటి పక్కనే పూడ్చిపెట్టి, ఏమీ తెలియనట్లు నాటకమాడింది.

మృతదేహం హనుమంతుదే..


అయితే నేరం ఎప్పుడూ దాగదు అన్నట్లుగా ఇటీవల సుకన్యకు, ఆమె కుమార్తెకు మధ్య జరిగిన ఒక చిన్న గొడవ ఈ పాపాన్ని బయటపెట్టింది. ఆ గొడవలో తండ్రి హత్య ప్రస్తావన రావడంతో విషయం కాస్తా హనుమంతు తండ్రి లక్ష్మన్న చెవిన పడింది. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు మిస్టరీ వీడింది. మార్చి 29న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం అది హనుమంతు మృతదేహమేనని శాస్త్రీయంగా నిర్ధారణ అయ్యింది.

సుకన్యతో పాటు కూతురు అరెస్ట్

పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టిన సీఐ గణేష్ బృందం ఎట్టకేలకు మల్లాపురం క్రాస్ వద్ద సుకన్యను, ఆమె మైనర్ కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో భర్త వేధించడం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు నిందితురాలు విచారణలో అంగీకరించింది. ఐదు నెలల పాటు అత్యంత రహస్యంగా సాగిన ఈ హత్య ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story