మడకశిరలో ఎవరికి మడత? టీడీపీ, వైసీపీ అభ్యర్థులపై తీవ్ర అసంతృప్తి

by Kema Shiva Kumar |   (  Updated:2024-03-13 03:07:54  IST  )

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ రాజకీయంలో అయోమయం నెలకొంది.

మడకశిరలో ఎవరికి మడత? టీడీపీ, వైసీపీ అభ్యర్థులపై తీవ్ర అసంతృప్తి
X

దిశ, మడకశిర: శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గ రాజకీయంలో అయోమయం నెలకొంది. తెలుగుదేశం పార్టీలో వర్గపోరుతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ఈరన్న, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వర్గ పోరు కొనసాగుతోంది. ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ సునీల్ కుమార్ కు టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో గుండుమల తిప్పేస్వామి వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది.

మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గీయులు టీడీపీ అధిష్టానం నియమించిన సునీల్ కుమార్ కు సహకరిస్తారా లేక అధిష్టానంపై తిరుగుబాటు ఎగరవేస్తారా అనే సంశయం నియోజకవర్గ ప్రజల్లో నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులూ సతమతం అవుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పేస్వామికి కాకుండా ఈరలకప్పను తెరపైకి తీసుకురావడంతో పలమనేరు తిప్పేస్వామి వర్గీయులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గీయులు కొత్త అభ్యర్థి ఈరలకప్పకు వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎంతవరకు సహకరిస్తారన్న ఆలోచనలో ఉంది.

కాంగ్రెస్‌కు కలిసొస్తుందా?

ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్న అయోమయంతో కాంగ్రెస్ పార్టీ వైపు రెండు పార్టీల కార్యకర్తలు చూస్తున్నట్లు తెలిసింది. ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి ప్రస్తుత సీడబ్ల్యుసీ సభ్యుడు రఘువీరారెడ్డి ఇటీవల కాలంలో మడకశిర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. మడకశిర ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు సద్వినియోగం చేసుకుంటే ఆ పార్టీ మంచి ఫలితాలు సాధించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Next Story