- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వహ్వా.. వాట్సప్ పాలన.. వారం రోజుల్లో 2,64,555 సేవలు
వాట్సాప్ గవర్నెన్స్‌కు ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో : వాట్సాప్ గవర్నెన్స్‌కు ప్రజల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది.ఫిబ్రవరి 4వ తేదీ నుంచి కేవలం వారం రోజుల్లోపే 2,64,555 లావాదేవీలు జరిగాయి. ఇందులో 41 శాతం (1,10,761) ఆర్థిక లావాదేవీలు, 43.1 శాతం (1,14,119) సమాచారం కొరకు ఉపయోగించారు. ఈ వారం రోజుల్లోనే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ విభాగాలు, ఆయా సంస్థలు రూ.54.73 లక్షలు వసూలు అయ్యాయి. అత్యధికంగా విద్యాశాఖలో 82,938 ట్రాన్సాక్షన్లు జరిగాయి. వాట్సాప్‌లో 85 శాతం ట్రాన్సాక్షన్లు విజయవంతంగా పూర్తి అయ్యాయి. 35 శాతం సర్వర్ స్పీడు సమస్య కారణంగా విఫలమయ్యాయని ఆయా శాఖలు తమ సర్వరు స్పీడు పెంచుకోవాలని ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ కోరారు.
రాబోయే రోజుల్లో ప్రజలెవ్వరూ కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే అవసరం లేకుండా, సేవలన్నీ కూడా వాట్సాప్‌లోనే అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ దిశగా అన్ని శాఖలు తమ బ్యాక్ ఎండ్ మెకానిజంసమర్ధంగా ఉండేలా చూసుకోవాలన్నారు. మంత్రులు, కార్యదర్శుల సదస్సులో వాట్సాప్ గవర్నెన్స్‌పై ఇచ్చిన ప్రజంటేషన్‌పైన సీఎం మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. వాట్సాప్ గవర్నెన్స్‌లో ప్రస్తుతం ఇస్తున్న సేవల సంఖ్య పెంచాలన్నారు. 161 సేవలిస్తున్నామని, రాబోయే 45 రోజుల్లో 500 సేవలు కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని, అలాగే రాబోయే మూడు లేదా ఆరు నెలల్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సేవలు కూడా వాట్సాప్‌లోనే ప్రజలు పొందేలా యంత్రాంగం సన్నద్ధం కావాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రయాణీకులు ఆర్టీసీ బస్సు జీపీఎస్ ట్రాకింగ్ కూడా తమ వాట్సాప్‌లోనే చూసుకునే సదుపాయం కల్పించాలన్నారు.
వాట్సాప్ గవర్నెన్స్‌లోకి టీటీడీ సేవలను కూడా తీసుకువస్తామని చెప్పారు. ఇవే కాకుండా అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి రైల్వే టికెట్లు కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులు పొందే సదుపాయం కల్పిస్తామన్నారు. సినిమా టికెట్లు కూడా వాట్సాప్ ద్వారా పొందే సదుపాయం కల్పించే అంశం కూడా పరిశీలించాలన్నారు. కేవలం ఇవే కాకుండా ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రయాన్ని కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే సేకరించాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్‌ను మనం విస్తృతంగా అమలు చేస్తున్న ఈ తరుణంలో కొంతమంది కావాలని విమర్శల చేసేవారుంటారని, ఎక్కడా ఎలాంటి లోపాలకు తావివ్వకుండా ప్రతి శాఖ కూడా సైబర్ సెక్యూరిటీ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ఐటీ శాఖ దీనిపైన ప్రత్యేకంగా పనిచేయాలన్నారు. వాట్సాప్‌లో క్యూ ఆర్ కోడ్, లేదా పౌరుల ఆధార్ అథంటికేషన్ కోరే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.






