- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ విజయంతో ఊపుమీద సీజేపీ.. కొత్త ఉద్యమాలకు సిద్ధమా?
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు, నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనతో దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన లోకం తీవ్ర నిరసన జ్వాలలతో రగిలిపోయింది.

దిశ, ఏపీ బ్యూరో: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు, నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనతో దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన లోకం తీవ్ర నిరసన జ్వాలలతో రగిలిపోయింది. ఇప్పటివరకు కేవలం సినిమాలు, క్రికెట్, సోషల్ మీడియాకే పరిమితమయ్యారని భావించిన ‘జెన్-జీ’ తరం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై అత్యంత ప్రతిఘటనతో పోరాటానికి దిగడం భారత రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. ‘కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)’ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా వ్యక్తమైన ఈ ఆందోళనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే కాకుండా, అధికార పీఠాన్ని హడలెత్తించాయి. ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి రావడం ఈ యువజన ఉద్యమానికి తొలి చారిత్రాత్మక విజయంగా నిలిచింది. కేంద్రం హామీలు ఇచ్చిందని ఉద్యమం చల్లబడుతుందా? లేక హామీలను కేంద్రం అమలుచేసేలా పర్యవేక్షిస్తుందా? నిజానికి ఇది ఆరంభం మాత్రమేనన్న సీజేపీ వ్యవస్థాపకుడు.. మున్ముందు ఎలాంటి ఉద్యమాలు చేపడతారు? ఈ వేడి చల్లారకుండా ఏం చేస్తారనేది? దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ-20 పెట్రోల్ అంశం..
ప్రస్తుతం పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి ఇస్తున్నారు. దీని వల్ల వాహనాలు పాడవుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. ఇది అన్యాయమంటూ నినదిస్తున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కుమారుడి ప్రయోజనాల కోసమే కేంద్రం ఇదంతా చేస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై ఆందోళన చేపట్టాలని కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు పెద్దఎత్తున సూచనలు అందాయి. ఈ మోసాన్ని నివారించడానికి ఆందోళన చేపట్టాలని విజ్ఞప్తుల పరంపర కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలకు తగ్గట్టు ఇక్కడ ఇంధన ధరలు లేవని.. దీనిపై కూడా పోరాటం చేయాలని చాలామంది కోరుతున్నారు.
కేంద్రం గుప్పిట్లో దర్యాప్తు సంస్థలు
కేంద్రంలోని మోడీ సర్కారు ఈసీఐ, సీబీఐ, ఈడీ, ఐటీ, జ్యుడీషియరీ లాంటి శాఖలను గుప్పిట్లో పెట్టుకున్నదని విపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. అనేక పార్టీలను రాజకీయంగా దెబ్బతీసేందుకు ఈ సంస్థలను వినియోగిస్తున్నదని మండిపడుతున్నాయి. ఫలితంగానే ఎన్నికల్లో విజయం సాధిస్తున్నదని జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల దాకా ఒకటే గగ్గోలు పెడుతున్నాయి. క్రోనీ క్యాపిటలిస్టులకు దేశాన్ని బలిచేస్తోందని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవిగాక ఈవీఎంల రద్దు కోసం ఉద్యమించాలని సగటు ప్రజల నుంచి పెద్ద ఎత్తున సూచనలు అందుతున్నాయి. వీటన్నింటిపై కాక్రోచ్జనతా పార్టీ ఇప్పుడు ఏం చేయబోతుందనే ఉత్కంఠ నెలకొంది.
పోరాటం ఏ అంశంపై?
అభిజిత్ దీప్కే బృందం.. కేంద్ర సర్కారు ముందుంచిన డిమాండ్స్ ప్రకారం నీట్, యూజీసీ పరీక్షల విధానంలో సంస్కరణలు చేపడతారా! ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత అమలు చేస్తారా! రిటైర్డ్ జడ్జీలకు పదవులు ఇవ్వకుండా చట్టం చేస్తారా! పార్టీ ఫిరాయింపుల చట్టానికి పదును పెడతారా? అనేది అనుమానమే. అంతటి చిత్తశుద్ధి కేంద్ర సర్కారులో లేదనేది అన్ని వర్గాల నుంచి టాక్ వినిస్తున్నది. కేవలం జెన్‌జీ తరంలో బీజేపీపై వ్యతిరేకతను తగ్గించడం కోసం సరేనన్నా.. అమలులో అసాధ్యమనేది స్పష్టమవుతున్నది. ఇచ్చిన హామీల అమలుకు అభిజిత్ ఎలాంటి పోరాట మార్గాలను ఎంచుకుంటారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సీజేపీ ఇంకా అంకురదశలోనే ఉంది. ఓ రాజకీయ పార్టీగా అవతరించలేదు. కానీ ‘ప్రెషర్ గ్రూప్’గా మారింది. ఎవ్వరూ ఊహించని విధంగా కేంద్రాన్ని మెట్టు దిగేలా చేసింది. నిజానికి ఆన్‌లైన్ మీమ్స్‌తో ప్రారంభమైన నిరసనతోనే సీజేపీ తొలి మెట్టు ఎక్కింది. మరి ఇక్కడనుంచి నిర్మాణాత్మకమైన రాజకీయ అజెండాతో ముందుకు వెళ్తుందా? లేక కేవలం సమస్యలపై పోరాటానికే పరిమితమవుతుందా? అనేదానిపై ప్రజల్లో ఎడతెగని చర్చలు కొనసాగుతున్నాయి. జంతర్‌మంతర్ నిరసనతో విద్యార్థి, యువజనుల్లో చెరగని ముద్ర వేసిన సీజేపీ మలి అడుగు ఎలా ఉంటుందని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.






