- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకేం సంబంధం.. అంతా అధికారులే చేశారు
దొరికితే దొంగ.. లేదంటే దొర అన్న చందంగా ఉంది తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి సరఫరాలో నిందితుల తీరు.

దిశ, వెబ్ డెస్క్: దొరికితే దొంగ.. లేదంటే దొర అన్న చందంగా ఉంది తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి సరఫరాలో నిందితుల తీరు. సిట్ విచారణతో వారిస్తున్న సమాధానాలు అసలు తాము నిమిత్త మాత్రులం అని.. తమకేం సంబంధం లేదన్నట్లుగా ఉంటున్నాయి. అంతా వారే చేశారు.. మాకేం సంబంధం అన్నట్లుగా సమాధానాలు వస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నుంచి కూడా ఇటువంటి సమాధానాలే సిట్ కు లభించినట్లు సమాచారం.
ప్రమేయం లేదు.. అధికారులే చూసుకున్నారు
తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ క్రమంలో వైసీపీ హయాంలో టీటీడీ చైర్మనుగా పని చేసిన వైవి సుబ్బారెడ్డిని హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉన్న ఆయన నివాసంలో ప్రత్యేక సిట్ టీం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు 10 గంటల పాటు గురువారం విచారించింది. సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్ప వాంగ్మూలం ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. దీంతో అంతా అధికారులే చూసుకున్నారని, తన ప్రమేయం ఏమి లేదని సుబ్బారెడ్డి బదులిచ్చినట్లు సమాచారం.
ల్యాబ్ నిర్ధారించిన ఎందుకు అనుమతించారు?
టీటీడీకి ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీ, భోలే బాబా డైరీలు సరఫరా చేసిన నెయ్యిలో వెజిటేబుల్ ఆయిల్ కలిసి ఉన్నాయని, అది కల్తీ నెయ్యి అని మైసూర్లోని సీఎఫ్ఆర్టీఏ ల్యాబ్ నిర్దారించింది. ఆ తరువాత కూడా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీలను నెయ్యి సరఫరాకు ఎందుకు అనుమతించారు. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి డైరీలను 2024 వరకు, భోలే బాబా డైరీని 2022 అక్టోబర్ వరకు నెయ్యి సరఫరాదారులుగా ఎందుకు కొనసాగించారని వైవి సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు.
చర్యలెందుకు తీసుకోలేదు?
కల్తీ నెయ్యి సరఫరా చేస్తున్నారని తెలిసినా ఆయా సంస్థల యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డిని అడిగారు. మీపై ఎవరి ఒత్తిడి ఉంది, కల్తీ నెయ్యి వ్యవహారాన్ని టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం సుబ్రహ్మణ్యం మీకు తెలియజేశారు కదా.. అయినా కూడా ఆయన ఫిర్యాదుపై మీరు ఎందుకు స్పందించలేదు. వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధమే లేని సంస్థలు టెండర్లలో పాల్గొనేలా వెసులుబాటు కల్పించేందుకు నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారని అధికారులు అడిగారు.
చిన్న అప్పన్న వాంగ్మూలంతో
టీటీడీ మాజీ ఈఓ ధర్మా రెడ్డి, వైవి సుబ్బారెడ్డి దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా చిన్న అప్పన్న గతంలో పనిచేశారు. ఆయన ఇచ్చిన వాంగ్మూలాలు, విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా సుబ్బారెడ్డిని అధికారులు ప్రశ్నించారు. తద్వారా సమాధానాలను రాబట్టే ప్రయత్నం చేశారు. అత్యధిక ప్రశ్నాలకు ఆయన తనకు సంబంధం లేదని, టెండర్లను ఆహ్వానించడం, ఖరారు చేయడం వంటివన్నీ అప్పటి అధికారులే చూసుకున్నారని బదులిచారు. ఏమైనా ఉంటే వారినే అడగాలంటూ విచారణ దాటవేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
నిబంధనల సవరణ ఎందుకు?
టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనే సంస్థలకు మూడేళ్లుగా డైరీ నిర్వహిస్తున్న అనుభవం ఉండాలనే నిబంధన ఉంది. మరి దాన్ని మార్చేసి ఏడాదిగా డైరీ నిర్వహిస్తుంటే చాలని ఎందుకు సరిపెట్టేశారని సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. సంబంధిత డైరీ గతేడాదిలో రోజుకు కనీసం 4 లక్షల లీటర్ల ఆవుపాలు సేకరించాలి, అందుకు ఆధారంగా ప్రొక్యూర్మెంట్ రికార్డులు ఎఫ్ఎస్ఎస్ఏఐ కి సమర్పించిన రిటర్న్ లో జత చేయాలనే నిబంధనను ఎందుకు గల్లంతు చేశారని సుబ్బారెడ్డిని అధికారులు ప్రశ్నించారు. ఆయా సంస్థల అవసరాల కంటే అదనంగా రోజుకు 8 టన్నుల నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉండాలనే నిబంధన ఎందుకు ఎత్తేశారు? పాలు సేకరించకుండా, వెన్నె తయారు చేయకుండా నెయ్యి ఉత్పత్తి సాధ్యం కాదనే సంగతి మీకు తెలియదా? అని సుబ్బారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తే.. అవన్నీ సంబంధిత అధికారులు నిపుణుల కమిటీ తీసుకున్న నిర్ణయాలని, వాటిలో తాను జోక్యం చేసుకోలేదని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
కిలోకు 25 రూపాయల లంచం
2022 మే నెలలో జాతీయ డైరీల నుంచి 24.50 లక్షల కిలోల నెయ్యి సరఫరాలకు టీటీడీ టెండర్లను ఆహ్వానించింది. అప్పట్లో వైవి సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న భోలే బాబా డైరీ ప్రతినిధుల్ని కిలోకు 25 రూపాయల చొప్పున లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని సిట్ అధికారులు తెలిపారు. ఇది మీ ప్రమేయంతోనే జరిగిందా అని సిట్ అధికారులు వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించారు. అందుకు సుబ్బా రెడ్డి తాను కానే కాదని జవాబు ఇచ్చినట్లు తెలిసింది. భోలేబాబా ప్రతినిధులు లంచం ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి సాంకేతిక కారణాలతో ఆ సంస్థను పోటీ నుంచి తప్పించి ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో చిన్నప్పన్నకు 50 లక్షల లంచం సొమ్ము చేరినట్లు దర్యాప్తులో వెల్లడైందని సిట్ అధికారులు అన్నారు. అవేవి తనకు గుర్తు లేవని సుబ్బారెడ్డి చెప్పినట్లు తెలిసింది.
చిన్న అప్పన్నపై చర్యలెందుకు లేవు?
చిన్నప్పన్న కిలోకు 25 రూపాయల చొప్పున లంచం అడుగుతున్నాడని భోలేబాబా కంపెనీ ప్రతినిధులు మీకు ఫిర్యాదు చేశారు. అయినా కూడా చిన్న అప్పన్నపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సిట్ అధికారులు అడిగారు. అవేవి తనకు గుర్తులేవని సుబ్బారెడ్డి బదులిచ్చినట్లు తెలిసింది. అప్పట్లో మీ పీఏగా పనిచేసిన చిన్న అప్పన్న బ్యాంకు ఖాతలో 2019-24 మధ్య రూ.4.69 కోట్లు జమ అయ్యాయి. అందులో రూ. 4.64 కోట్లు వివిధ బ్యాంకు ఖాతాలకు మళ్లాయి. ఇదంతా కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి అందిన లంచాల సొమ్మేనని తమ దర్యాప్తులో తేలిందని సిట్ అధికారులు తెలిపారు ఆ ఆర్థిక లావాదేవీలతో మీకేమి సంబంధం అని అధికారులు ప్రశ్నిస్తే తనకు సంబంధంలేదని సుబ్బారెడ్డి సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.
గత నాలుగు రోజులుగా
ఇదే కేసులో నవంబరు 11, 12 తేదీల్లో టీటీడీ మాజీ ఈఓ ఏవి ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. నాలుగు రోజులుగా సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పన్నను ప్రశ్నిస్తున్నారు. విచారణ సందర్భంగా వీరిద్దరితోపాటు ప్రొక్యూర్మెంట్ అధికారులు, భోలే బాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్, ఏఆర్ డైరీ ప్రతినిధులు చెప్పిన సమాధానాల ఆధారంగా అధికారులు ప్రశ్నావలి రూపొందించుకొని సుబ్బారెడ్డిని విచారించారు. అయితే ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న సిట్ అధికారులు మరోసారి విచారించనున్నట్లు తెలిసింది.






