- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kanuma Special: 'జగ్గన్నతోట' ప్రభల తీర్థం గురించి తెలిస్తే అసలు ఆగరు..!
తెలుగు వారి సంస్కృతీ, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. ముఖ్యంగా పండుగలు, పర్వదినాలలో తెలుగువారి ఆచార వ్యవహారాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి...

దిశ, పి.గన్నవరం: తెలుగు వారి సంస్కృతీ, సంప్రదాయాలు ఎంతో గొప్పవి. ముఖ్యంగా పండుగలు, పర్వదినాలలో తెలుగువారి ఆచార వ్యవహారాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. వాటిల్లో సంక్రాంతి పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పండుగను కోనసీమలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. పండుగ వేడుకల్లో భాగంగా నిర్వహించే ప్రభల ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
కోనసీమవ్యాప్తంగా మూడురోజులపాటు జరిగే సంక్రాంతి ఉత్సవాలలో కనుమ రోజున ప్రభలతీర్థం ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా జరుపుతారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామ శివారు జగ్గన్నతోటలో దాదాపు నాలుగు వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రభల తీర్థానికి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ తీర్థానికి తరలివచ్చే ప్రభలలో గంగలకుర్రు అగ్రహారం ప్రభలు ఎగువ కౌశిక నదిని దాటి వస్తున్న తీరు చూసి భక్తులు గగుర్పాటుకు గురవుతారు. మకరసంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయణకాలంలో ప్రభలను ఊరిపొలిమేరలు దాటిస్తే మంచిదని ప్రజల ప్రగాఢ విశ్వాసం.
కోనసిమ అంటేనే అందం. అది వేదసీమ అని పెద్దల ఉవాచ. శ్రీశైలపర్వత సానువుల తరువాత తొందరగా మనోఫలకమయ్యే ప్రదేశాలు కోనసీమ దైవక్షేత్రాలు. కోనసీమ నడుమ తరతరాలనుండీ జరుగుతున్న "జగ్గన్నతోట" ప్రభలతీర్థం వైభవానికి ఎంతో ఖ్యాతి ఉంది. మకరసంక్రమణ ఉత్తరాయణ మహాపుణ్యకాలంలో కనుమ నాడు కోనసీమలోని "మొసలిపల్లి శివారు జగ్గన్నతోట"లో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమము అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన, అతిపురాతనమైన, పవిత్రమైన సమాగమము.
ప్రాచీనకాలంలో మొట్టమొదటిగా ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాలరుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. ఈ తోటలో ఏవిధమైన గుడి గానీ, గోపురంగానీ ఉండవు. ఇది పూర్తిగా కొబ్బరి తోట. ఈ ఏకాదశరుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడంతో ఈ తోట విశేషప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఏకాదశరుద్రుల కొలువు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారము ఏకాదశరుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం మొత్తం మీద, ఈ భూమండలం అంతటికీ ఒక్కచోటే. అదీ వేదసీమ అయినటువంటి కోనసీమలోనే. లోక కల్యాణార్ధం ఈ పదకొండు గ్రామాల శివుళ్ళు జగ్గన్నతోటలో సమావేశం అయ్యి లోకవిషయాలు చర్చిస్తారని ప్రతీతి.
సుమారు 400 సంవత్సరాల క్రితం నుండి ఈ సంప్రదాయం ఉందనీ, అత్యంత తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17వ శతాబ్ధములోనూ ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి లోకరక్షణగావించారనీ ప్రతీతి. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతీసంవత్సరం కనుమ రోజు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ రుద్రులను ఒక్కచోట చేర్చుతారు ఆయా గ్రామస్తులు. సంస్థానదీశులైన రాజావత్సవాయి జగన్నాధ మహారాజుకు చెందిన ఈ తోట, జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది.
ఈ ఏకాదశరుద్రులు కొలువైన గ్రామాలు అంబాజీపేట మండలంలోని
వ్యాఘ్రేశ్వరం-శ్రీవ్యాఘ్రేశ్వరస్వామి (బాలాత్రిపురసుందరీ)
పుల్లేటికుర్రు-అభినవవ్యాఘ్రేశ్వరస్వామి (బాలాత్రిపురసుందరి)
మొసలపల్లి-మధుమానంతభోగేశ్వరస్వామి
గంగలకుర్రు-చెన్నమల్లేశ్వరుడు
గంగలకుర్రు(అగ్రహారం)-వీరేశ్వరుడు
పెదపూడి-మేనకేశ్వరుడు
ఇరుసుమండ-ఆనందరామేశ్వరుడు
వక్కలంక-విశ్వేశ్వరుడు
నేదునూరు--చెన్నమల్లేశ్వరుడు
ముక్కామల-రాఘవేశ్వరుడు
పాలగుమ్మి-చెన్నమల్లేశ్వరుడు
ఈ స్వామివారలను "ప్రభలపై" అలంకరించి మేళతాళాలతో, మంగళవాయిద్యాలు, భాజాబజంత్రీలతో "శరభాశరభా" హరహరమహాదేవ" అంటూ ఆయా గ్రామాలనుంచి వీరిని మోస్తూ ఈ తోటకు తీసుకువస్తారు. ఈ తోట మొసలపల్లి గ్రామంలో ఉంది కనుక మిగతా గ్రామ రుద్రులకు మొసలపల్లికి చెందిన మధుమానంత భొగేశ్వరుడు ఆతిధ్యం ఇస్తారు. ఈ రుద్రుడు అన్ని ప్రభల కన్నాముందే తోటకు చేరుకుని, అందరు రుద్రులూ తిరిగి వెళ్లిన తరువాత వెళ్లడం ఆనవాయితీ. ఈ ఏకాదశరుద్రులకు అధ్యక్షత వహించేది వ్యాఘ్రేశ్వారానికి చెందిన రుద్రుడు "శ్రీవ్యాఘ్రేశ్వరుడు". ఈ వ్యాఘ్రేశ్వరుడుకి చెందిన ప్రభ తోటలోకి రాగానే మిగతా రుద్ర ప్రభలన్నింటినీ మర్యాదపూర్వకంగా ఒకసారి పైకి లేపి మళ్ళీ కిందకు దించుతారు. ఈ 11 రుద్రులకు వ్యాఘ్రేశ్వరుడు అధిష్టానం.
ఇక్కడ మరో విశిష్టత ఏమిటంటే గంగలకుర్రు. గంగలకుర్రు అగ్రహారం రుద్రప్రభలు ఈ తోటకి రావాలంటే మధ్యలో గోదావరి పాయ, కౌశిక దాటాలి. ఆ గంగలకుర్రు ప్రభలను ఆ కాలువలోంచి ఏమాత్రం తొట్రూ లేకుండా "హరాహరా" అంటూ తీసుకువచ్చే ఆ గ్రామస్తుల ధైర్యం చూడడానికి రెండుకళ్ళు చాలవు. ఎందుకంటే కాలువలో మామూలుగానే నడవలేం. అలాంటిది ఒక 30 మంది మోస్తే కానీ లేవని ప్రభ ఆకాలువ లోంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇక ఆకాలువలోకి వచ్చేముందు వరిచేలను సైతం ఆ ప్రభలు దాటాల్సి వస్తుంది. ఆయా చేలలో పంటను తొక్కుతూ వచ్చినా సంబంధిత రైతులు బాధపడక సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు తమ చేల గుండా వెళ్ళడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఈ తీర్థాన్ని దర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన కోనసీమప్రజలే కాక, దేశవిదేశాలలోని వివిధ ప్రాంతాల వారు వచ్చి దర్శించి తరిస్తారు. చాలా మంది ఇప్పటికీ సంప్రదాయ వేషధారణలో పచ్చటి కొబ్బరి చాప కట్టిన ఎద్దుల బండ్లపై ఈ ఉత్సవాలకు రావడం ఆనవాయితీ. దేశ విదేశాల్లో స్థిరపడిన యువత సైతం కనుమ రోజు ఇక్కడకు చేరుకుని స్వయంగా ప్రభలను మోసుకొచ్చే దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్.పి. సుదీర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 11 గ్రామాల నుండి ప్రభలను తీసుకువచ్చే రహదారుల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇంతటి అద్భుతమైన, కన్నుల పండుగగా, సంప్రదాయ బద్దంగా వేలాది మందితో జరిగే జగ్గన్నతోట ప్రభల తీర్థం చూసే భాగ్యం సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే కలుగుతుంది. అదీ పెద్ద పండుగ సంక్రాంతి మూడవ రోజు కనుమ రోజున జగ్గన్నతోటలో మాత్రమే. ఎటువంటి ఆలయం గాని, గోపురం గాని, కనీసం చిన్న విగ్రహం గాని లేని రెండు ఎకరాల కొబ్బరి తోటలో జరిగే విశిష్ఠమైన తీర్థం ఇది. వేలాది మంది కోనసీమ వాసులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది ఈ ఏకాదశ రుద్రులను దర్శించే తరించేందుకు ఇక్కడకు వస్తూ ఉంటారు.
దేశ ప్రధాని నరేంద్రమోదీ సైతం ఇక్కడి విశిష్టతను గుర్తించి తన సందేశంలో జగ్గన్నతోట ప్రభల తీర్థం గురించి ప్రస్తావించారు. వేలాది మందితో ఎంతో క్రమశిక్షణతో కన్నుల పండుగగా జరిగే జగ్గన్నతోట ప్రభల ఉత్సవం చూసే అవకాశం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే.. ఇప్పుడు చూడలేకపోతే మరలా సంవత్సరం పాటు ఎదురు చూడాల్సిందే.
ఇంతటి విశిష్ఠత కలిగిన ఈ ఉత్సవం చూడాలనుకుంటే సంక్రాంతి మూడవ రోజు అంటే కనుమ రోజు డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలం మొసలిపల్లి రావాల్సిందే.
ఎలా రావాలి?
డా. బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుండి రావులపాలెం వెళ్ళే దారిలో ఉంది ఈ ప్రాంతం. అమలాపురం, రాజమండ్రి నుండి బస్సులు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారు రావులపాలెం నుండి గానీ, అమలాపురం నుండి గాని వచ్చి ఇక్కడకు చేరుకోవచ్చు.
కోటి సూర్యుల నుంచి ఉద్బవించినందునే ప్రభను రంగురంగుల నూలు దారాలు, కొత్త వస్త్రాలతో తీర్చిదిద్దుతారు. పరమశివుడిని ప్రతిష్ఠించి ఊరేగింపుగా తీసుకువస్తారు. ప్రభల తయారీలో గ్రామ సంప్రదాయం, సంస్కృతి ప్రతిబింబిస్తాయి. కనుమ పండుగ రోజు జరిగే ఈ తీర్థానికి భోగి పండుగకు రెండు రోజుల ముందు ఆలయ ప్రధానార్చకులు పూజలు చేసిన తరువాత ప్రభల తయారీకి శ్రీకారం చుడతారు. ప్రభల తయారీకి తాటిశూలం, టేకుచెక్క, పోకచెట్ల పెంటిలను, శివునికి ప్రీతిపాత్రమైన మర్రి ఊడలను ఉపయోగిస్తారు. తేలికపాటి వెదురు బొంగులను ఆంగ్ల అక్షరం 'యు' ఆకారంలో వంచి అందులో అమర్చుతారు. ప్రభకు పైన దేవాలయాల్లో ఉంచే పసిడి కుండను ఉంచి చుట్టూ నెమలి పింఛాలతో అలంకరిస్తారు.






