West Godavari: గణపవరంలో ఎమ్మెల్యే అరెస్ట్‌తో ఉద్రిక్తత

by Disha Web Desk 16 |
West Godavari: గణపవరంలో ఎమ్మెల్యే అరెస్ట్‌తో ఉద్రిక్తత
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గురించి తెలియనివారుండరేమో. నిత్యం ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అంతేకాదు వినూత్నమైన పద్ధతులలో నిరసన తెలపడంలో ఆయనకు మరొకరు సాటి రారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రజలకు సైకిల్ తొక్కుకుంటూ పేపర్లు వేయాలన్నా.. రోడ్డుపై గుంతల్లో చేపలు పట్టాలన్నా....పశులకు మేత స్వయంగా మోసుకెళ్లి వేయాలన్నా ఇలా ఎన్నో కార్యక్రమాలు వినూత్నంగా చేపడతారు. తాజాగా మరోసారి వినూత్న రీతిలో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు.


పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించినాడ వద్ద దళితుల భూముల్లో మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసనకు దిగారు. దళితుల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం పెరుగులంక గోదావరి ఏటిగట్టుపై ధర్నా చేశాను. రాత్రి అక్కడే బస చేశారు. తెల్లవారు జామున నిద్ర లేచి ఆరుబయటే స్నానం చేశారు. గడ్డం గీసుకున్నారు. అనంతరం టిఫిన్ చేసి మళ్లీ నిరసనకు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దళితులకు మద్దతుగా రామానాయుడు ఆందోళనకు దిగడంతో టీడీపీ శ్రేణులు, స్థానిక దళితులు తరలివచ్చారు. దీంతో పోలీసులు నిమ్మల రామానాయుడును అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు.

అయితే టీడీపీ కార్యకర్తలు, దళితులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును అరెస్ట్ చేసి గణపవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా స్టేషన్‌కు వెళ్లిన టీడీపీ నేతలు కోళ్ల నాగేశ్వరరావు, చెరుకు రామకృష్ణ చౌదరి, కోళ్ల పండు, కాసాని అంజి, రాయలం కృష్ణ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గణపవరం పోలీస్ స్టేషన్ ముట్టడించారు. అయితే నిమ్మలరామానాయుడు పోలీస్ స్టేషన్‌లోనూ నిరసన కొనసాగించారు.


Next Story

Most Viewed