సత్యసాయిబాబా స్ఫూర్తితో గిరిజన మహిళల సంక్షేమం : సీఎం

by Thanuru Gopichand |

శ్రీ సత్యసాయి బాబా స్ఫూర్తితో గిరిజన మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వ పని చేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

సత్యసాయిబాబా స్ఫూర్తితో గిరిజన మహిళల సంక్షేమం : సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : శ్రీ సత్యసాయి బాబా స్ఫూర్తితో గిరిజన మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వ పని చేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పుట్టపర్తిలో జరిగిన సత్యసాయిబ బాబా శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సత్యసాయి ట్రైబల్ వుమెన్ హెల్త్ కేర్ ప్రొగ్రాంను వేదికపై ప్రకటించారు. అందులో భాగంగా గిరిజన మహిళలకు సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తామన్నారు. అంతేకాకుండా టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. మెడికల్ స్క్రీనింగ్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ కు చికిత్సను అందిస్తామన్నారు. అంతేకాకుండా త్రాగునీటిని సరఫరా చేస్తామని పేర్కొన్నారు. పేదరికం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న గిరిజన మహిళలను చదివిస్తే, వారు సొంత కాళ్లపై నిలబడేలా చేస్తే మొత్తం గిరిజన సమాజాన్ని వారు ముందుండి నడిపిస్తారని సీఎం తెలిపారు. ఈ పథకం కేవలం సంక్షేమం మాత్రమే కాదన్నారు. దేశ నిర్మాణానికి ఒక ముందడుగు అన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే మాటకు నిదర్శనమని అభివర్ణించారు.

సత్యసాయి సిద్ధాంతాన్ని పంచుకుందాం

శ్రీ సత్యసాయిబాబా సిద్ధాంతాన్ని ప్రపంచంతో పంచుకుందామని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రతి భక్తులు శాంతికి ప్రతినిధి కావాలని, ప్రి ఇల్లు సేవకు కేంద్రం కావాలని, ప్రతి భూభాగం సత్యం, శాంతి, అహింసలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. ఈ ఐదు సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరచాలన్నారు. బాబా మనకిచ్చిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమంటే ఆయన ఆశయాల సాకారానికి పని చేయడమేనని స్పష్టం చేశారు. ప్రపంచంలో శాంతి, సంతోషం నెలకొనాలనే ఆయన ఆకాంక్షలనె నెరవేరుద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.

నీటి ప్రాజెక్టుల కోసం తాకట్టు పెట్టాలనుకున్నారు

సత్యసాయిబాబా మానవత్వానికి నిదర్శనంగా సీఎం చంద్రబాబు ఒక సంఘటనను ప్రస్తావించారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడుల్లో సత్యసాయిబాబా మేజర్ నీటి ప్రాజెక్టులను చేపట్టారన్నారు. అనంతపురం, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో నీటి కొరతను తీర్చేందుకు ప్రాజెక్టును చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. పనులను పూర్తి చేయడానికి ఒకానొక సందర్భంలో ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టాలనుకున్నారన్నారు. విషయం తెలుసుకున్న భక్తులు బాబా వద్దకు చేరుకొని విరాళాలను ఇవ్వడంతో ప్రాజెక్టు ఊపందుకుందన్నారు. అది సత్యసాయిబాబాకు మానవత్వం పట్ల ఉన్న నిబద్ధతను సూచిస్తుందన్నారు.

కోటీశ్వరుల పిల్లలు పేదల సేవ చేస్తారు

సత్యసాయి సన్నిధిలో కోటీశ్వరుల పిల్లలు పేదలకు సేవ చేయడం తన కళ్లారా చూశానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అలా సేవా భావాన్ని అలవరచుకునేందుకు వారి తల్లిదండ్రులు పంపడం నిజంగా గొప్ప విషయమన్నారు. సత్యసాయి సన్నిధిలో ఎటువంటి బేధభావాలకు తావులేదన్నారు. 140 దేశాల్లో 2వేలకు పైగా శాఖలతో రిజిస్టర్ అయిన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ కు 7.50 లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉన్నారని వెల్లడించారు.

Next Story