భవిష్యత్తులో స్లీపర్ బస్సులు రద్దు చేస్తాం: రవాణా శాఖ మంత్రి మండిపల్లి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2026-04-07 11:35:41  IST  )

ఏపీలో రోడ్డు ప్రమాదాల నివారణపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

భవిష్యత్తులో స్లీపర్ బస్సులు రద్దు చేస్తాం: రవాణా శాఖ మంత్రి మండిపల్లి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో రోడ్డు ప్రమాదాల నివారణపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కర్నూలు, మార్కాపురం, మారేడుమిల్లిలో జరిగిన బస్సు ప్రమాదాలకు మానవ తప్పిదమే కారణమని స్పష్టం చేసిన ఆయన.. భవిష్యత్తులో అవసరమైతే స్లీపర్ బస్సులను రద్దు చేస్తామని, ఈ మేరకు కేంద్రానికి లేఖ కూడా రాశామని వెల్లడించారు. మంగళవారం బస్సు ప్రమాదాల నివారణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు.

స్పెషల్ డ్రైవ్.. భద్రతా నిబంధనలు

‘రాష్ట్రవ్యాప్తంగా 16 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర తనిఖీలు చేస్తున్నాం. పది రోజుల్లోనే 10 వేల వాహనాలను తనిఖీ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన ఇతర రాష్ట్రాల వాహనాలను సీజ్ చేశాం. 300 కి.మీ.లకు పైగా ప్రయాణించే బస్సుల్లో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. డ్రైవర్ల తీరును పర్యవేక్షించేందుకు ఏఐ (AI) ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయనున్నాం. త్వరలో బస్సు సీట్లపై టాక్సేషన్ తగ్గించేలా చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి తెలిపారు. రాష్ట్ర, జాతీయ రహదారులపై అతివేగాన్ని అరికట్టేందుకు రూ. 40 కోట్లతో స్పీడ్ గన్‌ల ఏర్పాటుకు నిర్ణయించామని, ఇందుకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. ప్రమాదాల నివారణకు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని మంత్రి మండిపల్లి హెచ్చరించారు.

Next Story