హుద్‌హుద్‌, తిత్లీ తుఫాన్లను ఎదుర్కొన్న అనుభవం ఉంది

by Thanuru Gopichand |   (  Updated:2025-10-29 09:34:04  IST  )

గతంలో హుద్ హుద్, తిత్లీ తుఫాన్లు వచ్చినప్పుడు ఎదురైన పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం తమ ప్రభుత్వానికి ఉందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు.

హుద్‌హుద్‌, తిత్లీ తుఫాన్లను ఎదుర్కొన్న అనుభవం ఉంది
X

దిశ, వెబ్ డెస్క్ : గతంలో హుద్ హుద్, తిత్లీ తుఫాన్లు వచ్చినప్పుడు ఎదురైన పరిస్థితులను ఎదుర్కొన్న అనుభవం తమ ప్రభుత్వానికి ఉందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటరులో ఎప్పటికప్పుడు తుఫాను పరిస్థితులను అంచనా వేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తగిన చర్యలకు మార్గ నిర్దేశనం చేస్తున్నారన్నారు. ప్రధానమంత్రితో కూడా సీఎం మాట్లాడారన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని విధాల సహాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలోని 40 లక్షల మంది తుఫాను కారణంగా ప్రభావితమైతున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. ప్రధానంగా కాకినాడ, బాపట్ల, కోనసీమ, గుంటూరు జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు.

రాష్ట్రంలోని 364 పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే అవసరమైన చోట విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. సముద్రతీర ప్రాంతానికి, లోతట్టు ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదని కోరారు. ఇప్పటి వరకు 1,238 తుఫాను ప్రభావిత గ్రామాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించారు. ప్రజా ప్రతినిధులు కూడా తమ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. సహాయక చర్యల్లో పాల్గొని ప్రజలకు అండగా నిలవాలని అన్నారు.

READ MORE .....

త్వరగా ప్రాథమిక అంచనాలు ఇవ్వండి: తుపాను నష్టంపై మంత్రి లోకేశ్ ఆదేశాలు

Next Story