అటవీ శాఖను బలోపేతం చేస్తున్నాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

by Kema Shiva Kumar |

ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో అటవీశాఖకు వాహనాలు, ప్రత్యేక అంబులెన్స్‌లను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అందజేశారు.

అటవీ శాఖను బలోపేతం చేస్తున్నాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో అటవీ శాఖను మరింత బలోపేతం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఇవాళ మంగళగిరిలోని ఏపీఎస్పీ (APSP) బెటాలియన్ ప్రాంగణంలో జరిగిన ‘ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం’ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ వేత్తలకు, జంతు ప్రేమికులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అటవీశాఖ పనితీరును మెరుగుపరిచేందుకు ‘హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టు’ (Hanuman Foundation Project) ఆధ్వర్యంలో అటవీశాఖకు వాహనాలు, ప్రత్యేక అంబులెన్స్‌లను పవన్ కల్యాణ్ చేతుల మీదుగా అందజేశారు. వన్యప్రాణుల అత్యవసర వైద్యం మరియు సంరక్షణ కోసం ఇవి ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వన్యప్రాణులు, మనుషుల మధ్య పెరుగుతున్న సంఘర్షణను (Man-Animal Conflict) తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. వన్యప్రాణుల నుంచి మనుషులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని అన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏనుగుల వల్ల పంటలకు జరుగుతున్న నష్టాన్ని అరికట్టేందుకు, రైతులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా డిప్యూటీ సీఎం వెల్లడించారు. మరోవైపు ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా అడవులను, వన్యప్రాణులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని అటవీశాఖను మరింత బలోపేతం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

Next Story