అతిసారకు ప్రధాన కారణం నీటి కాలుష్యమే : మంత్రి సత్యకుమార్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-25 07:51:24  IST  )

రాష్ట్రంలో ప్రబలుతున్న అతిసార వ్యాధికి ప్రధాన కారణం నీటి కాలుష్యమేనని మంత్రి సత్యకుమార్ మండలిలో వెల్లడించారు.

అతిసారకు ప్రధాన కారణం నీటి కాలుష్యమే : మంత్రి సత్యకుమార్
X

దిశ, వెబ్‌డెస్క్: కూటమి ప్రభుత్వ హయాంలో పాలు, నీళ్లు తాగినా ప్రజలు చనిపోతున్నారని మండలిలో వైసీపీ సభ్యులు విమర్శించారు. రాజమండ్రి కల్తీపాలు, శ్రీకాకుళం డయేరియా ఘటనలపై వైసీపీ సభ్యులు సభలో ప్రశ్నించారు. దీనిపై మంత్రి సత్యకుమార్ సమాధానమిచ్చారు. కొన్నేళ్లుగా రాష్ట్రంలో తాగునీటిపంపిణీలో క్లోరినేషన్ జరగడం లేదని గుర్తించామని, ఇటీవలే క్లోరినేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. డయేరియా ప్రబలడానికి తాగునీరు కలుషితం కావడమే ప్రధాన కారణమని పేర్కొన్నారు. వ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకుల్ని నిరంతరం క్లీన్ చేస్తున్నామని, జల్ జీవన్ పథకం ద్వారా సురక్షిత నీటిని అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాలను పెంచేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. 20 నెలల్లో 14 డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేశామని తెలిపారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. కిడ్నీ మార్పిడులు చేసిన రోగులకు పింఛన్లు ఇచ్చే అంశాన్నీ ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. కిడ్నీ రోగిపై సగటున రూ.86 వేలు చొప్పున 20 నెలల్లో రూ.224 కోట్లు ఖర్చు పెట్టినట్లు సభలో వివరించారు. ఇక శ్రీకాకుళంలో డయేరియా కేసులు అదుపులోకి వచ్చాయని మంత్రి సత్యకుమార్ మండలిలో ప్రకటించారు. పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపైనా అక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.

Next Story