- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, డైనమిక్ బ్యూరో: భవిష్యత్తు తరాలకు నీటిని సురక్షితంగా అందించాలంటే ప్రతి ఒక్కరిలో జల సంరక్షణపై చైతన్యం రావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. జల్ జీవన్ మిషన్ 2.0లో భాగంగా నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. గురువారం కానూరులోని ఏపీఎస్ఐఆర్డీ (APSIRD) భవన్‌లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ‘గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలో జలవనరుల స్థిరత్వం’ అనే అంశంపై జరిగిన వర్క్‌షాపును ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జలమే జీవమని, పరిమితంగా ఉన్న నీటిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే భావితరాలకు తీరని అన్యాయం చేసినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణా, పెన్నా లాంటి నదులే ఆంధ్రప్రదేశ్ జీవన విధానానికి, వ్యవసాయ అభివృద్ధికి ఆధారమని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉపరితల జలాలు కలుషితం కావడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడం ప్రధాన సవాళ్లుగా మారాయన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు సాంకేతికతను వినియోగించుకుంటూ, ప్రజల భాగస్వామ్యంతో ఏజెన్సీ ప్రాంతాల్లో వాటర్ షెడ్ల పునరుద్ధరణకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు.
100 రోజుల ప్రత్యేక డ్రైవ్..
ప్రధాని మోడీ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర జలశక్తి మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో నీటి పొదుపు చర్యలు చేపడుతున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏప్రిల్ 6 నుంచి జూలై 14వ తేదీ వరకు ‘100 రోజుల నీటి వినియోగ డ్రైవ్’ను చేపట్టిందన్నారు. భూగర్భ జలాల పెంపు, వర్షపు నీటిని ఒడిసి పట్టడం, వృథాను అరికట్టడం, వాడిన నీటిని పునర్వినియోగించడం వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత అవగాహన తీసుకురావడమే ఈ డ్రైవ్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. ప్రకృతిని కాపాడుకుంటేనే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని ఆయన ఉద్బోధించారు. ఈ వర్క్‌షాపులో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ పి.కృష్ణయ్య, ఏపీ ఎస్ఐఆర్డీ కమిషనర్ ముత్యాల రాజు, అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






