జనసేన vs టీడీపీ.. పిఠాపురంలో చేదాటిన పరిస్థితి!

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-21 11:18:50  IST  )

పిఠాపురం నియోజకవర్గంలో కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం ముదిరి ఉద్రిక్తతకు దారితీసింది.

జనసేన vs టీడీపీ.. పిఠాపురంలో చేదాటిన పరిస్థితి!
X

దిశ, వెబ్‌డెస్క్/పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గంలో కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం ముదిరి ఉద్రిక్తతకు దారితీసింది. ఫ్లెక్సీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫొటో లేకపోవడంపై మొదలైన చిన్న తగాదా, చివరకు నేతల మధ్య పరస్పర విమర్శలు, ఘర్షణ వరకు వెళ్లింది. అధికారిక ఫ్లెక్సీలలో సీఎం ఫొటో లేకపోవడాన్ని టీడీపీ నేతలు ప్రశ్నిస్తుండగా, జనసేన నేత తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జోక్యం చేసుకోవడంతో గొడవ మొదలైంది. ఈ క్రమంలో స్థానిక టీడీపీ నేత వర్మ తీవ్రంగా స్పందించారు. "పిఠాపురంలో టీడీపీ ఇంకా బలంగా ఉంది కాబట్టే ఇక్కడ 70 వేల మెజార్టీ వచ్చింది. మేము లేకపోతే జనసేన గెలిచేదా?" అని ఆయన ప్రశ్నించారు. తాము ఎక్కడి నుంచో దత్తత రాలేదని, స్థానికంగా పార్టీ బలంగా ఉందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పెండెం దొరబాబు హెచ్చరిక..

వర్మ వ్యాఖ్యలపై జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తీవ్రంగా మండిపడ్డారు. వర్మ మొదటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. పవన్ ఫ్లెక్సీలను టీడీపీ నేతలు ధ్వంసం చేసినందుకే మేము నిలదీశాం. చంద్రబాబు, లోకేష్ దగ్గర మార్కులు కొట్టేయడానికే వర్మ ఇలా ప్రవర్తిస్తున్నారు. ఆయనలో చాలా చీకటి కోణాలు ఉన్నాయి, త్వరలోనే వాటన్నింటినీ బయటపెడతాను అని దొరబాబు హెచ్చరించారు.

ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసుల నిఘా..

ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మోహరించడంతో పిఠాపురంలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో కలిసి నడిచిన నేతలు, ఇప్పుడు ఇలా బహిరంగంగా విమర్శలు చేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అగ్ర నాయకత్వం జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని సద్దుమణిగించాలని కార్యకర్తలు కోరుతున్నారు.

Next Story