Minister Amarnath: అడిగిన వెంటనే పరిష్కారం..!

by Disha Web Desk 16 |
Minister Amarnath: అడిగిన వెంటనే పరిష్కారం..!
X

దిశ, ఉత్తరాంధ్ర: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు అట్టడుగు వర్గాల ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన అనకాపల్లి నియోజకవర్గం వల్లూరు, గొర్లివానిపాలెం గ్రామాల్లో పర్యటించారు. ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ పథకాలను లబ్ధిదారులకు అందజేయడంతో పాటు, అవి అందుతున్న తీరును కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఏ చిన్న సమస్య కూడా లేకుండా చూడాలన్న సంకల్పంతో ఆయన ముందుకు సాగారు. ఈ సందర్భంగా విధి దీపాలు, కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని అమర్‌నాథ్‌ను కోరగా వెంటనే ఆ శాఖ అధికారులను పిలిపించి, త్వరగా ఆయా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఒకరిద్దరు ఇళ్ల స్థలాలు, పింఛన్లు కావాలని కోరగా జూన్ నెలలో మంజూరు చేస్తామని అమర్‌నాథ్ చెప్పారు.

ఇదిలా ఉండగా గొర్లివానిపాలెం శ్మశాన వాటికలో విద్యుత్ సదుపాయం కల్పించాలని స్థానికులు మంత్రి అమర్‌నాథ్‌కు వారం రోజులు కిందట విజ్ఞప్తి చేశారు. వెంటనే విద్యుత్ శాఖ సిబ్బంది శ్మశాన వాటికలోనూ అక్కడికి వెళ్లే మార్గంలో 16 విద్యుత్ స్తంభాలను కొత్తగా ఏర్పాటు చేసి లైట్లు వెలిగేలా చర్యలు తీసుకున్నారు. సత్వర చర్యలు తీసుకున్న అధికారులను మంత్రి అమర్‌నాథ్ అభినందించారు.

ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ ఎన్ని సమస్యలు ఎదురైనా సంక్షేమ పథకాల అమలు విషయంలో వెనుకడుగు వేయకుండా జగన్మోహన్ రెడ్డి మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారన్నారు. కాబట్టే గత ప్రభుత్వాలు సాధించలేనంత ప్రజా మన్నను వైసీపీ ప్రభుత్వం దక్కించుకుందని చెప్పారు. సంక్షేమ పథకాలను నిర్విరామంగా ప్రజలకు అందించడాన్ని ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయని, పేదల పట్ల వారికున్న కపట ప్రేమ అర్థమవుతుందని మంత్రి అమర్ నాథ్ విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90 శాతానికి పైగా అమలు చేసి జగన్మోహన్ రెడ్డి రికార్డ్ సృష్టించారని ఆయన చెప్పారు. ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా, కుట్రలు పన్నినా జగన్మోహన్ రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలిచే ఉంటారని అమర్‌నాథ్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు బలపరచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


Next Story