సీఐఐ సమ్మిట్‌ సూపర్ హిట్.. రాష్ట్రంలో 16 లక్షల మందికి ఉద్యోగాలు : సీఎం చంద్రబాబు

by Naga Rani Yarlagadda |

విశాఖ సీఐఐ సమ్మిట్ సూపర్ హిట్ అయిందని, దీనిని ఎంతో చారిత్రాత్మకంగా నిర్వహించామన్నారు.

సీఐఐ సమ్మిట్‌ సూపర్ హిట్.. రాష్ట్రంలో 16 లక్షల మందికి ఉద్యోగాలు : సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: 2019-24 మధ్య కాలం రాష్ట్రానికి గడ్డుకాలమని, ఆ సమయంలో రాష్ట్రంలోని ఇండస్ట్రీలను విధ్వంసం చేశారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 17 నెలల తమ పాలనలో రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు. విశాఖలో రెండ్రోజుల సీఐఐ సమ్మిట్ లో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించిన వివరాలను సీఎం వెల్లడించారు. విశాఖ సీఐఐ సమ్మిట్ సూపర్ హిట్ అయిందని, దీనిని ఎంతో చారిత్రాత్మకంగా నిర్వహించామన్నారు. సదస్సులో పెట్టుబడులతో పాటు చర్చలకూ ప్రాధాన్యమిచ్చినట్లు పేర్కొన్నారు. 4,975 మంది ఈ సమ్మిట్ లో భాగస్వామ్యం అయ్యారని, 630 మంది విదేశీ ప్రతినిధులు వచ్చారని సీఎం తెలిపారు. ఈ సమ్మిట్ లో 613 ఎంఓయూలు జరగ్గా.. రాష్ట్రానికి కొత్తగా రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. వీటి ద్వారారాష్ట్రంలో 16.31 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని చెప్పారు.

రెండేళ్లలో రాజధాని అమరావతి నుంచి క్వాంటం కంప్యూటర్స్ తయారు చేస్తామన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీకి ఈ సదస్సులో రూ.1980 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. ఇవాళ ఒక్కరోజే సీఎం సమక్షంలో 48 ఎంఓయూలు జరగ్గా.. రాష్ట్రానికి రూ.48,430 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 94,155 మంది ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

ఇక శ్రీసిటీలో కొన్ని కంపెనీలను వర్చువల్ గా ప్రారంభించారు. 12 ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకోగా.. ఆ పెట్టుబడులతో 12,365 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. అలాగే రేమాండ్ ప్రాజెక్టులకూ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. రూ.1201 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో రేమాండ్ 3 ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది.

Next Story