Viveka murder case: వివేకా హత్య కేసు.. రెండేళ్ల తర్వాత మళ్ళీ రంగంలోకి సీబీఐ

by Ramesh Naini |

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో భాగంగా సుప్రీంకోర్టు సూచనల మేరకు సీబీఐ అధికారులు రెండేళ్ల తర్వాత మరోసారి విచారణను వేగవంతం చేశారు.

Viveka murder case: వివేకా హత్య కేసు.. రెండేళ్ల తర్వాత మళ్ళీ రంగంలోకి సీబీఐ
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండేళ్ల తర్వాత మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు సూచనల మేరకు సీబీఐ అధికారులు ఈ కేసులో మరోసారి విచారణను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం కడప జిల్లా పులివెందుల పోలీస్ స్టేషన్‌లో అధికారులు విచారణ చేపట్టారు.

నిందితుల బంధువులకు నోటీసులు

ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారి కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. సునీల్‌ యాదవ్‌ సోదరుడు కిరణ్‌కుమార్‌ యాదవ్, భరత్‌కుమార్‌ యాదవ్‌ సోదరుడు మహేంద్ర యాదవ్‌లను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. శుక్రవారం ఉదయం మహేంద్ర యాదవ్‌ పులివెందుల పోలీస్ స్టేషన్‌కు చేరుకుని విచారణకు హాజరు కాగా, కిరణ్ యాదవ్ సాయంత్రం లోపు అధికారుల ముందు ప్రవేశించే అవకాశం ఉంది.

అర్ధరాత్రి వాట్సాప్ కాల్‌పై ఆరా

ఈ విచారణలో ప్రధానంగా కాల్ డేటా అంశం కీలకంగా మారింది. వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 1:42 గంటల సమయంలో కిరణ్‌ యాదవ్‌, అర్జున్‌రెడ్డి అనే వ్యక్తికి వాట్సాప్ కాల్ చేసినట్లు సీబీఐ గుర్తించింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది? అంత అర్ధరాత్రి కాల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 20వ తేదీన హైదరాబాద్‌లో వీరిద్దరిని ప్రాథమికంగా ప్రశ్నించిన అధికారులు, మరింత లోతైన సమాచారం కోసం ఇప్పుడు పులివెందులలో విచారణ కొనసాగిస్తున్నారు. రెండేళ్ల తర్వాత సీబీఐ మళ్ళీ యాక్టివ్ అవ్వడంతో ఈ కేసులో ఎలాంటి మలుపులు తిరుగుతాయనేది ఉత్కంఠగా మారింది.

Next Story