విశాఖ ఆర్కే బీచ్‌లో కలకలం: సముద్రంలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం! కాపాడిన లైఫ్ గార్డ్స్

by Ramesh Naini |

విశాఖపట్నంలోని ప్రసిద్ధ రామకృష్ణా (ఆర్కే) బీచ్‌లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది.

విశాఖ ఆర్కే బీచ్‌లో కలకలం: సముద్రంలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం! కాపాడిన లైఫ్ గార్డ్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖపట్నంలోని ప్రసిద్ధ రామకృష్ణా (ఆర్కే) బీచ్‌లో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. సముద్రంలో దూకి ప్రాణాలు తీసుకునేందుకు యత్నించిన ఆ మహిళను బీచ్ లైఫ్ గార్డ్స్ సకాలంలో స్పందించి సురక్షితంగా రక్షించారు. వివరాల్లోకి వెళితే.. ఆర్కే బీచ్‌కు వచ్చిన ఓ మహిళ ఉన్నట్టుండి ఒక్కసారిగా సముద్రంలోకి దూకేసింది. అలల ఉధృతికి లోపలికి కొట్టుకుపోతున్న ఆమెను గమనించిన బీచ్ లైఫ్ గార్డ్స్ వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రాణాలకు తెగించి నీటిలోకి దిగిన సిబ్బంది, తీవ్రంగా శ్రమించి సదరు మహిళను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో అక్కడ ఉన్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు..

సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఆ మహిళకు పోలీసులు, సంబంధిత సిబ్బంది ధైర్యం చెప్పి ప్రాథమికంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆమెను పోలీస్ స్టేషన్‌కు తరలించి, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యమా? లేక మరేదైనా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సకాలంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడిన లైఫ్ గార్డ్స్‌ను స్థానికులు అభినందించారు.

Next Story