టెక్కీ రాధా గాయత్రి కుటుంబానికి అండగా ఉంటాం.. టీడీపీ స్టేట్ చీఫ్ భరోసా

by Ramesh Naini |

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు నేపథ్యంలో ఆమె తల్లి సత్యవతి విశాఖపట్నంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిశారు.

టెక్కీ రాధా గాయత్రి కుటుంబానికి అండగా ఉంటాం.. టీడీపీ స్టేట్ చీఫ్ భరోసా
X

దిశ, డైనమిక్ బ్యూరో: టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు నేపథ్యంలో ఆమె తల్లి సత్యవతి విశాఖపట్నంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిశారు. ఈ సందర్భంగా రాధాగాయత్రి కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చి, కేసులో న్యాయం జరిగేలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర హోంమంత్రి వి. అనితతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. రాధాగాయత్రి మృతి ఘటన గురించి తెలుసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన, భర్త శ్రీచరణ్ ప్రవర్తన మొదటి నుంచే అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. బంధువుల సమాచారం ప్రకారం శ్రీచరణ్ సింహాచలం ప్రాంతంలోని ఓ లాడ్జిలో బస చేసినట్లు, కేసు నమోదైన వెంటనే అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోందని చెప్పారు. ఇప్పటికే ముస్సోరిలో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. రాధాగాయత్రి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా రాధాగాయత్రి తల్లి సత్యవతి మాట్లాడుతూ, ‘మొదటి నుంచే శ్రీచరణ్ సైకోనే. తనను వేధిస్తున్నాడని వారం రోజుల ముందే రాధాగాయత్రి చెప్పింది. ఆమె మృతిచెందిన రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీచరణ్ గాయత్రితో కలిసి దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సాధారణంగా ఎప్పుడూ అలాంటి ఫొటోలు పెట్టని అతడు ఆ రోజు మాత్రమే పోస్టు చేశాడు. మరుసటి రోజు ఉదయం గాయత్రి మృతిచెందిందని తెలియజేస్తూ ఫ్లైట్ టికెట్‌ను పంపించాడు’ అని ఆరోపించారు. రాధా గాయత్రి మృతి కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, విజయనగరం జిల్లా మామిడిపల్లికి చెందిన రాధా గాయత్రికి గతేడాది నవంబర్‌లో విశాఖకు చెందిన శ్రీచరణ్‌తో వివాహమైంది. ఇటీవల ఇద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్లగా, ఉత్తరాఖండ్‌లోని ముస్సోరిలో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

Next Story