విశాఖ | పాచిపోయిన ఆహారం, కంపు కొడుతున్న కర్రీలు!

by Thanuru Gopichand |

రోడ్ల వెంట బండ్లపై విక్రయించే టిఫిన్లు (Street Food) ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారుతున్నాయా అంటే అవుననే సమాధానం లభిస్తోంది.

విశాఖ | పాచిపోయిన ఆహారం, కంపు కొడుతున్న కర్రీలు!
X

దిశ, వెబ్ డెస్క్ : రోడ్ల వెంట బండ్లపై విక్రయించే టిఫిన్లు (Street Food) ప్రజారోగ్యానికి పెనుముప్పుగా మారుతున్నాయా అంటే అవుననే సమాధానం లభిస్తోంది. ఎందుకంటే ఇటీవల ఆహార కల్తీ (Food Adulteration) విపరీతంగా పెరిగిపోయింది. కొత్త కొత్త పేర్లు, ఆకర్షణీయమైన వంటకాలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న తినుబండారాల విక్రేతలు, వాటిలో రుచి కోసం రసాయనాలను, సింథటిక్ రంగులను సైతం కలపడానికి వెనుకాడడం లేదు. ముఖ్యంగా వీధుల్లో వ్యాపారాలు చేసేవారు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వివిధ ఆహార పదార్థాలను వండి వడ్డిస్తున్నారు. అయితే వాటిల్లో చాలా వరకు నిల్వ ఉండే ఆహారం ఉండడం ప్రస్తుతం ఆందోళన కలిగించే విషయంగా పరిణమించింది. తాజాగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC)కి చెందిన శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చారు.

ఆకట్టుకునే పేర్లు.. పాచిపోయిన పదార్థాలు!

జీవీఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఆందోళనకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా ఎంవీపీ కాలనీలో నిర్వహించిన తనిఖీల్లో దిగ్భ్రాంతికర నిజాలు బయటపడ్డాయి. ఆకర్షణీయమైన పేర్లతో ఆహార పదార్థాలు విక్రయిస్తు్న్నప్పటికీ వాటిలో నాణ్యత ఉండడం లేదని అధికారులు గుర్తించారు. కొన్ని టిఫిన్ సెంటర్లలో అయితే ఏకంగా పాచిపోయిన ఆహారానికే రుచులు అద్ది వడ్డిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. అంతేకాకుండా పలు చోట్ల ఆహార పదార్థాల నుంచి దుర్వాసన వస్తోందని, నిల్వ ఉంచిన కర్రీలను కూడా నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారని అధికారుల తనిఖీల్లో తేలింది. అందులోనూ ఫాస్ట్ ఫుడ్ పేరుతో కల్తీ, అపరిశుభ్ర ఆహారం విక్రయిస్తున్న తీరు విశాఖ వాసులను విస్తుపోయేలా చేస్తోంది.

కర్రీలు కంపు కొడుతున్నాయి..

ఫుడ్ సేఫ్టీ నిబంధనలను ఉల్లంఘిస్తూ టిఫిన్ వ్యాపారాలు చేస్తున్న కొన్ని బండ్లలో వంటకాలు ఏ మాత్రం తినడానికి పనికిరాని విధంగా కంపు కొడుతున్నట్లు తనిఖీల్లో తేలింది. ముఖ్యంగా మష్రూమ్, పనీర్ వంటి కర్రీలు రోజుల తరబడి నిల్వ ఉంచడం వల్ల దుర్వాసన వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కర్రీలను తిరిగి వేడిచేసి వినియోగదారులకు అందిస్తున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. గతంలో కూడా విశాఖపట్నంలోని అనేక హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలలో సైతం ఆహార భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, పాచిపోయిన ఆహారం, గడువు ముగిసిన పదార్థాలు వాడుతున్నారని తనిఖీల్లో వెల్లడైనట్లు తెలుస్తోంది.

నామ మాత్రపు చర్యలతో..

ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతున్నా నామ మాత్రపు చర్యలతో సరిపెడుతున్నారనే ఆరోపణలున్నాయి. తాజాగా చేసిన తనిఖీల్లో కేవలం రూ.2,500లు జరిమానా విధించి అధికారులు చేతులు దులుపుకున్నారని విశాఖవాసులు అంటున్నారు. తినుబండారాల విక్రేతల తీరులో మాత్రం మార్పు రావడం లేదని పేర్కొంటున్నారు. అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్న వ్యాపార విధానాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చూస్తూ నాణ్యమైన ఆహారం ప్రజలకు అందేలా చూడాలని కోరుతున్నారు. దాదాపు 60 శాతానికి విక్రయ కేంద్రాల్లో ఏదో ఒక రకమైన ఉల్లంఘనలు జరుగుతున్నట్లు గత నివేదికలు చెబుతున్నాయని ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు కూడా తాము కొనుగోలు చేసే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Next Story