- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకరు సేఫ్.. సముద్రంలో ఏడుగురు మత్స్యకారుల గల్లంతు.. సీఎం చంద్రబాబు ఆరా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్షించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖ సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ ప్రమాదంలో గల్లంతైన ఏడుగురిలో బోటు యజమాని కారె చిన్నయ్యను సహాయక బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చగా, మిగిలిన ఆరుగురి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అధికారుల సమాచారం ప్రకారం.. ఈ నెల 1వ తేదీన విశాఖ చేపల రేవు నుంచి ఏడుగురు మత్స్యకారులు బోటులో వేటకు వెళ్లారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో, 4వ తేదీకల్లా తిరిగి వచ్చేస్తామని కుటుంబ సభ్యులకు ఫోన్‌లో చెప్పారు. అయితే, శనివారం సాయంత్రం దాటినా వారు తిరిగి రాకపోవడంతో పాటు, ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
గల్లంతైన ఆరుగురు వీరే..
భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, సీతోడు, భీమిలికి చెందిన బండియ్య, విశాఖకు చెందిన చిన్న అమ్మోరు కోసం గాలింపు కొనసాగుతోంది.
సీఎం ఆదేశాలు.. రెస్క్యూ ఆపరేషన్
మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్టుగార్డు నౌకలతో పాటు, నేవీ హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను సమర్థవంతంగా సమన్వయం చేసుకోవాలని మెరైన్ ఐజీపీ, విశాఖ సీపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గాలింపు చర్యల పురోగతిపై తనకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.






