- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రజా ప్రభుత్వం: మంత్రి పొంగులేటి
రెండవ విడతలో ప్రతి అసెంబ్లీ నియోజక వర్గానికి మరో 2 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.

దిశ, తిరుమలాయపాలెం: ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుమలాయపాలెం మండల ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో కల్యాణలక్ష్మి, సి.ఎం. రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, కొత్త తెల్ల రేషన్ కార్డుల జారీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, డైట్ ఛార్జీలను 40 శాతం పెంపు, గురుకులాల్లో కాస్మొటిక్ ఛార్జీలను 200 శాతం పెంపు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
గత ప్రభుత్వం వరి కొనుగోళ్లను..
గత ప్రభుత్వం పేదల గృహ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని, ప్రజా ప్రభుత్వం మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. రెండవ విడతలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మరో 2 వేల ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి పేర్కొన్నారు. 25 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేశామని తెలిపారు. రైతు భరోసా సాయాన్ని ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని చెప్పారు. గత ప్రభుత్వం వరి కొనుగోళ్లను నిర్లక్ష్యం చేసిందని పేర్కొన్న మంత్రి, ప్రస్తుత ప్రభుత్వం కనీస మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు 500 రూపాయలు బోనస్ అందిస్తోందన్నారు. దేశంలోనే రికార్డు స్థాయిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేశామని తెలిపారు. అదేవిధంగా మొక్కజొన్నను కూడా కొనుగోలు చేసినట్లు చెప్పారు.
రాబోయే రెండున్నర సంవత్సరాల్లో..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఆశించిన స్థాయిలో లేకపోయినా ప్రజలకు మేలు చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. నిరుద్యోగ యువతకు సుమారు 72 వేల ఉద్యోగాలను కల్పించినట్లు వెల్లడించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు. గత ఏడాది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదల వైద్య చికిత్సల కోసం రూ.1,034 కోట్ల సహాయాన్ని అందించామని పేర్కొన్నారు. రాబోయే రెండున్నర సంవత్సరాల్లో కూడా మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులు స్థానిక వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు తీసుకుని అనుకూలమైన పంటలను సాగు చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్.ఈ. శ్రీనివాసచారీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.పుల్లయ్య, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.






