Minister Amarnath: తాగునీటి సమస్యపై అధికారులకు కీలక ఆదేశాలు

by Disha Web Desk 16 |
Minister Amarnath: తాగునీటి సమస్యపై అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, అనకాపల్లి: వేసవిలో గ్రామీణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి కొరత లేకుండా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. స్థానిక మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు అధ్యక్షతన ఏడవ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలను ప్రజాప్రతినిధులు తమ దృష్టికి తీసుకొస్తే సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఇంటింటికి నీరు అందించేందుకు ప్రవేశపెట్టిన జలజీవన్ పథకం పనులు అనకాపల్లి మండలంలో 12 కోట్ల రూపాయలతో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు.

విశాఖ జిల్లాలో ఒక లక్ష 30 వేలకు పైగా జగనన్న ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. ఈ పథకం కింద అనకాపల్లి నియోజకవర్గంలో 5000 పైచిలుకు లబ్ధిదారులకు పట్టాల మంజూరు చేసినట్లు తెలిపారు. రహదారులకు మహర్దశను తీసుకొచ్చేలా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. దీనిలో భాగంగా రూ. 32 కోట్ల రూపాయలతో కొత్తూరు నుంచి రావికవతం వరకు కేబీ రోడ్లు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. అలాగే బవులవాడ నుంచి చోడవరం వెళ్లే రహదారికి కూడా శరవేగంతో మరమ్మతు పనులు చేపడుతున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫ్యామిలీ డాక్టర్లను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. అక్కా చెల్లెమ్మలకు అండగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మూడో విడత ఆసరా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 6,500 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందజేశారన్నారు. దీనిలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో 1800 గ్రూపులకు మూడో విడత కింద 13 కోట్ల 92 లక్షల రూపాయలు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనకాపల్లి పట్టణంలో ఇరిగేషన్ పనులకు సంబంధించి గ్రోయిన్ల మరమ్మత్తుల కోసం 4.86 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని తెలిపారు. 10 లక్షల రూపాయలతో ప్రత్యేకంగా ఆధునీకరణ చేసిన మండల ప్రజా పరిషత్ భవనానికి మంత్రి అమర్నాథ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు.


Next Story